Ex DGP Mahender Reddy: మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి లక్ష కోట్ల ఆస్తులు! ఆరోపణలపై ఆయన ఏమన్నారంటే
Telangana Ex DGP Mahender Reddy: రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. లక్ష కోట్ల అవినీతి ఆరోపణలపై మహేందర్ రెడ్డి స్పందించారు.
Mahendhar Reddy Retd IPS: హైదరాబాద్: తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. మాజీ డీజీపీ, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల మేర ఆస్తులు కూడకట్టారని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి ఆధారాలను సమర్పిస్తూ.. గవర్నర్ తమిళిసైకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి, డీజీపీని రాపోలు కోరారు.
అవినీతి ఆరోపణలపై స్పందించిన రిటైర్డ్ డీజీపీ
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రిటైర్డ్ డీజీపీ, TSPSC Chairman మహేందర్ రెడ్డి స్పందించారు. తాను 36 ఏళ్లకు పైగా ఎలాంటి కళంకం లేకుండా పనిచేశానన్నారు. పదవీ విరమణ వరకు మూడున్నర దశాబ్ధాలకు పైగా అంకిత భావంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో పనిచేశా అన్నారు. తన కెరీర్ మొత్తంలో, తాను క్లీన్ రికార్డ్ కొనసాగించానని పేర్కొన్నారు.
డీజీపీగా సేవలు అందించిన రిటైర్డ్ అయినా.. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం తన సేవలు గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించిందన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం అన్నారు. కొందరు తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి అన్నారు. అందులో వాస్తవం లేదని, ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే తన ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారితో పాటు వాటిని వైరల్ చేస్తున్న వారందరిపై క్రిమినల్ పరువునష్టం దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.