ST Reservations: ఎస్టీలకు గుడ్ న్యూస్, 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ
Reservations for Tribal: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పింది. 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
Reservations for Tribal: తెలంగాణం సీఎం కేసీఆర్ గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి రాష్ట్ర సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం నుంచే ఈ రిజర్వేషన్ల పెంపు అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఈ నెల 17వ తేదీన జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో సీఎం కేసీఆర్ మాటకు కట్టుబడి ఉన్నట్లు నిరూపించుకున్నారు. అయితే మాట ప్రకారమే వెంటనే రిజర్వేషన్ కల్పించడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు అమలవుతున్న ఆరు శాతం రిజర్వేషన్ల విధానాన్నే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తూ వచ్చింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనవి గిరిజన రిజరవేషన్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజన జనాభా ఆరు నుంచి పదిశాతానికి వెళ్లింది. దీని ప్రకారమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అయితే కేంద్రం యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న సుప్రీంకోర్టు నిబంధన ఉంది కాబట్టి తీర్మానాన్ని పట్టించుకోలేదు. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దు అన్న ప్రతిబంధన లేదు. మన పక్కన ఉన్న తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారని టీఆక్ఎస్ గుర్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏడో షెడ్యూల్‌లో చేరిస్తే చాలని కేసీఆర్ అంటున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు చెప్తూనే.. తప్పనిసరి పరిస్థితుల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించవచ్చన్నది. ఈ మేరకు తమిళనాడు 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. అదే విధానాన్ని తెలంగాణకూ వర్తింప చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
తెలంగాణ నుంచి ప్రతిపాదనే రాలేదని పార్లమెంట్‌లో చెప్పిన కేంద్రం !
జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని 2017లోనే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపింది. రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తెలంగాణ చేసిన బిల్లుకు కేంద్ర గిరిజన శాఖ మద్దతు తెలియజేస్తున్నదని కేంద్ర డిప్యూటీ సెక్రటరీ దిలీప్‌కుమార్ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. గిరిజనులకు 2011 లెక్కల ప్రకారం 9.08 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్ కల్పించాలని సూచించారు.కేంద్ర హోం శాఖ ఈ బిల్లులో కొన్ని అంశాలపై వివరణ కోరగా, 2018 ఏప్రిల్ 26న రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మరుసటి రోజే కేంద్ర హోంశాఖ బిల్లుపై సమీక్షించింది. కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కూడా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పింది. అయితే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ‘ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు’ అని ప్రకటించడంతో దుమారం రేగింది. ఆ సమాధానం ప్రకారం గిరిజన రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదని అనుకోవచ్చు.