Modi Tour Twitter Trending : మోదీ టూర్‌పై టీఆర్ఎస్, బీజేపీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వార్ - పాలిటిక్స్ అంటే ఇట్లుంటది మరి !
మోదీ తెలంగాణ టూర్‌పై టీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తూంటే... బీజేపీ నేతలు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు చోట్లా వీరి పోరాటం సాగింది.
Modi Tour Twitter Trending : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు వస్తున్నారు. ఈ సందర్భం అటు ఆఫ్‌లైన్‌లో ఇటు ఆన్‌లైన్‌లోనూ సందడి నెలకొంది. సాధారణంగా అయితే ప్రధాని వస్తున్నారంటే బీజేపీ నేతలు హడావుడి చేస్తారు. కానీ మోదీ తెలంగాణకు వస్తున్నారంటే టీఆర్ఎస్ నేతలు కూడా బిజీ అయిపోతారు. బీజేపీ నేతలది ఆహ్వాన సందడి అయితే.. టీఆర్ఎస్ నేతలది వ్యతిరేక ప్రచారం హడావుడి. ఈ సారి కూడా అది కనిపిస్తోంది. అటు ఆన్‌లైన్‌లో .. ఇటు ఆఫ్‌లైన్‌లోనూ ఇది సాగుతోంది.
ఉదయం నుంచి బీజేపీ, టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు బిజీ !
మోదీ పర్యటన గురువారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఉదయం తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ వస్తారు. ఉదయం నుంచి ట్విట్టర్‌లో గో బ్యాక్ మోదీ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది. వీటిని టీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రెండింగ్‌లో గో బ్యాక్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ ఓ సందర్భంలో టాప్ లో నిలిచింది.
అయితే బీజేపీ నేతలు మాత్రం ఊరుకుంటారా... టీఆర్ఎస్ కార్యకర్తలకు పోటీగా వారు కూడా తెలంగాణ విత్ మోదీ హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేశారు. ఇది కూడా ట్రెండింగ్‌లో నిలిచింది కానీ టీఆర్ఎస్‌తో పాటు టాప్‌లోకి ట్రెండింగ్‌లోకి తేలేకపోయారు.
మోదీకి ఘన స్వాగతం చెప్పేందుకు బీజేపీ నేతల హడావుడి !
మరో వైపు ఆఫ్‌లైన్‌లో బీజేపీ నేతల సందడి ఎక్కువగా ఉంది. మోదీ విమానంలో బేగంపేట వచ్చి హెలికాఫ్టర్‌లో ఐఎస్‌బీకి వెళ్తారు. అయినప్పటికీ బేగంపేట దగ్గర బీజేపీ నేతలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అలాగే... గచ్చిబౌలితో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఫ్లెక్సీలతో నింపేశారు. అందుకే ఆ ఫ్లెక్సీలన్నీ ఎక్కువగా తెలుగులోనే ఉన్నాయి. ఒకవేళ మోదీ ఆ దారిలో వెళ్లినా వాటిలో మ్యాటర్ అర్థం చేసుకోలేరు.
తెలంగాణకు రావాల్సిన వాటి సంగతేమిటని టీఆర్ఎస్ ప్రశ్నలు !
టీఆర్ఎస్ నేతలు కూడా ఆఫ్‌లైన్‌లో మోదీకి వ్యతిరేకంగా తమ ప్రచారం చేశారు. నగరంలో చాలా చోట్ల.. విభజన హామీలు.. తెలంగాణకు రావాల్సిన నిధులు.. ప్రాజెక్టుల గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
మోదీ వచ్చింది అధికారిక పర్యటనకు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు పెట్టుకోలేదు. ఇక్కడిదాకా వచ్చారు కాబట్టి ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలతో కాసేపు మాట్లాడతారు. అయితే.. ఆయనపర్యటన కేంద్రం అటు ఆఫ్ లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ చేసుకున్న రాజకీయ ఆరోపణలు మాత్రం ట్రెండింగ్‌గా మారాయి.