TS News Developments Today : నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సహా కీలక అప్ డేట్స్
ఎమ్మెల్సీ కవిత సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న తర్వాత ముఖ్యంత్రి కేసీఆర్ స్పందించలేదు. మహబూబ్ నగర్ సభా వేదికగా ఆయన సీబీఐ, కేంద్రంపై ఆయన ఇవాళ మాట్లాడే అవకాశం ఉంది.
నేడు మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసిఆర్ పర్యటన
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత పరిపాలన భవన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి బహిరంగసభ అసక్తిగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి బహిరంగసభ ఇది. అలాగే కూతరు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నుంచి నోటీసులు ఇచ్చిన తర్వాత సీఎం కేసిఆర్ స్పందించలేదు. ఈ సభా వేదికగా ఆయన సీబీఐ, కేంద్రం మీద ఆయన మాట్లాడే అవకాశం ఉంది. సీబీఐ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఈనెల 6న అంటే మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన వివరణ కోరే అవకాశం ఉంది.
సీఎం పర్యటన ముందస్తు అరెస్ట్ లు, ఖండించిన కాంగ్రెస్
సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ సభను అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతో పట్టణంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేయడం గృహ నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తామేమి టెర్రలిస్టులం కాదనీ, కేసిఆర్ ది రాచరికపాలనగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వస్తుంటే ప్రజా ప్రతినిధులు కలిసే అవకాశాలు కల్పించాలనీ, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే అవకాశాన్ని కల్పించాలని సంపత్ కోరారు. అలాగే పోలీసులు కూడా శృతిమించి ప్రవర్తిస్తున్నారనీ, ఎప్పటికి ఒకే ప్రభుత్వం ఉండదనీ, జాగ్రత్త ఉండాలని సంపత్ హెచ్చరించారు.
నేడు హైదరాబాద్ కు కేంద్ర సహాయ మంత్రి
హైదరాబాద్ లో నేడు కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలి పర్యటించనున్నారు. బేగంపేటలోని ఓ హోటల్లో మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొంటారు.
నేటి నుంచి శిల్ప తరగతులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాలలో మూడేళ్ల కోర్సు తరగతులు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్ష పాసైన 15 మందితో ఆదివారం తరగతులు ప్రారంభం కానున్నాయి.
నేడు నిర్మల్ నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర నిర్మల్ నియోజకవర్గానికి చేరుకుంది. ఇవాళ బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర చేత్యాల, వెంగపేట్, ఎడిగాన్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ నిర్మల్, శాంతి నగర్, కండ్లీ మీదుగా సాగనుంది. ఈ రోజు 11.5 కిమీ ల పాదయాత్ర కొనసాగనుంది.
వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్రకు నేడు బ్రేక్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నుంచి 10 రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగేలా పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం లింగగిరి గ్రామం వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించేలా రూట్ మ్యాప్ సైతం సిద్ధం అయింది. అయితే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అనుమతి ఇవ్వాల్సిన వరంగల్ పోలీసులు చివరి నిమిషం వరకు ఎదురుచూసే ధోరణిగా వ్యవహరించి పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వాలో చెప్పాలి అంటూ షోకాజ్ నోటీస్ లు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లు కారణం చూపించే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న పాదయాత్రను అడ్డుకొనే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తే.. YSR తెలంగాణ పార్టీ నిబంధనలను ఉల్లంఘించిందని పోలీసులు నాటకం ఆడుతున్నారని వైఎస్సార్టీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పాదయాత్రను అడ్డుకొనే విధంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ఈ అంశంపై YSR తెలంగాణ పార్టీ న్యాయపరంగా నోటీసులకు వివరణ ఇవ్వడంతో పాటు కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఇవాళ ఒక్క రోజు పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు ప్రకటించింది. వరంగల్ పోలీసులకు న్యాయబద్ధంగా వివరణ ఇస్తామని..అప్పటికీ అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పాదయాత్రను అడ్డుకొనేలా అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు తిప్పి కొడతామని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు