Top Headlines: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
Telugu Top Headlines: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయం, అంతర్జాతీయ స్థాయిలో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.
Top 10 Headlines In Telugu States On 23rd April:
1. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం
ఏపీ సీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుట్రకోణంపై నిందితున్ని మరింత లోతుగా విచారించాల్సిన ఉందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును కోరారు. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
2. పిఠాపురంలో నేడు జనసేనాని నామినేషన్
ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ వేయనున్నారు. ఉదయం చేబ్రోలు నుంచి ర్యాలీగా బయలుదేరి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ క్షేత్రం వరకూ వెళ్తారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు.
3. సీఎం జగన్ నేటి బస్సు యాత్ర షెడ్యూల్
ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు. అనంతరం చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి.. తర్వాత తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. చింతవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుని రాత్రి బస చేస్తారు.
4. నేడు ఏపీకి బీజేపీ కీలక నేతలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం మంగళవారం కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా వారు పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏపీ బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ అరుణ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, కేంద్ర మంత్రులు వీకే సింగ్, ఎల్ మురుగన్, జీవీఎల్ నరసింహారావు.. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్లకు హాజరు కానున్నారు.
5. నేడు టీటీడీ సేవల టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. టీటీడీ వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను మంగళవారం తితిదే విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించి అంగ ప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేస్తారు. అలాగే, బుధవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
6. నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో మంగళవారం వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా సిటీలో కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ డైవెర్షన్ లు ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ మళ్లింపులు ఉండే మార్గాలను కూడా సీపీ ప్రకటించారు. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ మందిరం నుంచి తాడ్ బండ్ హానుమాన్ మందిర్ వరకు విజయ యాత్ర జరుగుతుందని సీపీ తెలిపారు. ఆ యాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
7. నేటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. దీంతో ఈడీ, సీబీఐ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. ఆమెను మరికొద్ది రోజులు కస్టడీలో ఉంచాలని దర్యాప్తు సంస్థలు కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈడీ అరెస్ట్ పై కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును న్యాయమూర్తి మే 2కు వాయిదా వేశారు.
8. ఇంటర్ తర్వాత మూడేళ్ల లా డిగ్రీపై విచారణకు సుప్రీం నో
ఇంటర్ లేదా తత్సమాన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (LLB Degree) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కోర్సు విధానం బాగానే ఉందని స్పష్టం చేస్తూ.. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు నిరాకరించింది. తక్షణమే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది.
9. నేడు ఐపీఎల్ లో చెన్నై, లక్నో ఢీ
ఐపీఎల్(IPL)లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(CSK)... లక్నో(LSG)పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. గత మ్యాచ్‌లో క్వింటన్ డికాక్, కెప్టెన్ కె.ఎల్.రాహుల్ చెలరేగడంతో చెన్నైపై లక్నో విజయాన్ని అందుకుంది. ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రుతురాజ్ గైక్వాడ్ సేన తహతహలాడుతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ధోనీ మెరుపులు మెరిపిస్తుండడంతో చెన్నైలోని చిదంబరం స్టేడియానికి అభిమానులు పోటెత్తనున్నారు. పాయింట్ల పట్టికలో నాలుగు స్థానంలో ఉన్న చెన్నై... అయిదో స్థానంలో ఉన్న లక్నో ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలోపైకి ఎగబాకాలని చూస్తున్నాయి.
10. నవ్వులు పూయిస్తోన్న అల్లరి నరేష్ కొత్త సినిమా ట్రైలర్
కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్. ఆయన హీరోగా మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటి అడక్కు'. ఇందులో 'జాతి రత్నాలు' ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో, తాజాగా హీరో నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ లాంచ్ చేశారు. పెళ్లీడు వయసు వచ్చినా పెళ్లికాని అల్లరి నరేష్.. తన జీవిత భాగస్వామిని సెట్ చేసుకోడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది 'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ లో చూపించారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.