Thummala Nageswara Rao: తెలంగాణలోని ఆ మార్కెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు, ప్లాన్ ఏంటో చెప్పిన మంత్రి
Koheda Market Yard: తెలంగాణలోని కొహెడ పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.
Koheda Fruit Market: కొహెడ పండ్ల మార్కెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేలా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న కొహెడ పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కొహెడ మార్కెట్ యార్డుని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మార్కెట్ అభివృద్ధికి సబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
గోదాములపై సోలార్ ప్యానెల్స్
అలాగే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డును సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు మంత్రి నాగేశ్వర రావు జారీ చేశారు. దానితో పాటుగా రాష్ట్రంలో మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తున్నాయని, తరచూ రైతులు నష్టపోతున్నారని, వాటిని నివారించడానికి, అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోనే శానిటరీ నాప్‌కిన్లు
బుగ్గపాడు మెగా టెక్స్‌టైల్ పార్కులో వచ్చే నెలలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్‌కిన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
నిర్మాణ రంగానికి 40 శాతం విద్యుత్
రాష్ట్రంలో ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా ప్రభుత్వ పథకాలు ఉంటాయని, ఇందుకు అనుగుణంగా దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. నగరంలోని హైటెక్స్‌లో గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షోను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి శుక్రవారం శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
Participated in the Green Building Property show conducted by CII's IGBC along with @UttamINC today at Hitex. pic.twitter.com/YupkoXLWgT
— Sridhar Babu Duddilla (@OffDSB) May 17, 2024
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘నిర్మాణ రంగంలో హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వీటి నిర్మాణం ప్రారంభమైంది. ప్లాస్టిక్ వినియోగంపై అప్పట్లో మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కఠిన చట్టాలను తీసుకొచ్చారు. హరిత భవనాల గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలి. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆకస్మిక తనిఖీలు చేశాను’ అని అన్నారు.
ఐదు నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేశాం. గతంతో పోలిస్తే ఐటీ రంగంలో మెరుగైన పెట్టుబడులు వస్తున్నారు. రూ.వేలకోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. పెట్టుబడులతో ఉద్యోగాలతో పాటు యువతకు పరోక్షంగా ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సులభతర వాణిజ్య విధానానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెట్టుబడిదారులు, నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి రంగానికి మా ప్రభుత్వం కావలసినంత తోడ్పాటును అందిస్తుంది’ అని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.