Telangana Congress New Incharge : చార్జ్ తీసుకోబోతున్న తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ - సీనియర్లు దారికొస్తారా ?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ రెండు రోజుల పర్యటనకు వస్తున్నారు. పార్టీలో గ్రూపుల్ని నియంత్రించేందుకు తన వంతు ప్రయత్నం చేయనున్నారు.
Telangana Congress New Incharge : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ మాణిక్‌రావు థాకరే రంగంలోకి దిగుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించి తెలంగాణ కాంగ్రెస్ నేతలందరితో పరిచయాలు పెంచుకోవాలనుకుంటున్నారు. ఇందు కోసం షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. 11,12 తేదీల్లో రెండు రోజుల పాటు పార్టీ సమావేశాలతో బిజిబిజీగా ఉండనున్నారు థాక్రే.. 11 తేదీన 10 గంటలకు హైదరాబాద్ చేరుకుని తొలుత.. 11 గంటలకు ఏఐసీసీ సెక్రటరీ లతో సమావేశమవుతారు.అనంతరం 11:30గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. 12 గంటలకు సీఏల్పీ నేత తో మీటింగ్ అవుతారు. 12:30 సీనియర్ నేతలు ,వర్కింగ్ ప్రెసిడెంట్ లతో చర్చిస్తారు. 3 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగులో పాల్గొంటారు. 4 గంటలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ప్రసంగిస్తారు.. 5 గంటలకు పీసీసీ అధికార ప్రతినిధులతో సమావేశమవుతారు.
తిరిగి 12 తేదీ న ఉదయం 10:30కి డీసీసీ అధ్యక్షులతో సమావేశమై వెంటనే…11:30 గంటలకు అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ కానున్నారు థాకరే. 12:30 గంటలకు పార్టీలోని వివిధ సెల్స్ ,డిపార్ట్మెంట్ అధ్యక్షులతో మీటింగులో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు థాకరే తిరిగి ఢిల్లీ వెళ్తారు.మాణిక్‌రావు థాకరే మహారాష్ట్రకు చెందిన నేత. గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా ఏఐసీసీ అధిష్టానం మాణిక్‌రావు థాకరేను నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.
కొత్త ఇంచార్జ్ రాకపై సీనియర్ నేతల స్పందన ఎలా ఉంటుందోనని టీ కాంగ్రెస్ వ్యవహారాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఏ నేత ఇంచార్జ్ గా వచ్చినా అసమ్మతి గ్రూపు వారికి చుక్కలు చూపిస్తూ వస్తోంది. అప్పట్లో కుంతియా..ఆ తర్వాత వచ్చిన మాణిగం ఠాగూర్ కూడా అసంతృప్తి నేతలను తట్టుకోలేకపోయారు. హైకమాండ్ ను బతిమాలి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇప్పుడు మహారాష్ట్ర నేత వస్తున్నారు. అయితే ఆయన ఇతర నేతల్లా సాఫ్ట్ కాదని.. చాలా హార్డ్ గా డీల్ చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో సీనియర్ నేతలు ఆయనతో ఎలా ఉంటారన్న చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఇంచార్జ్ ను మార్పించడంలో సక్సెస్ అయ్యామనుకుంటున్న తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు.. ఎలాగైనా పీసీసీ చీఫ్ ను కూడా మార్పించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం వారు హైకమాండ్ పై మరింత ఒత్తిడి వ్యూహం అమలు చేయనున్నట్లుగా చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో గ్రూపులన్నింటినీ ఏకం చేసేందుకు మాణిక్ రావు ధాకరే ప్రయత్నించనున్నారు. సాఫ్ట్ గా డీల్ చేస్తే ఇప్పటి వరకూ అన్నీ ఎదురు దెబ్బలే తగిలాయి కాబట్టి ఈ సారి ధాకరే రూటు మారుస్తారని అంటున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ వ్యవహారశైలితోనే కాంగ్రెస్ లో గ్రూపులు పెరుగుతాయా.. తగ్గుతాయా అన్నది తేలే అవకాశం ఉందంటున్నారు.