Telangana Judge Suspend : తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్ - సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - అసలేం జరిగిందంటే ?
తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో ఇచ్చిన ఆదేశాలే దీనికి కారణం.
Telangana Judge Suspend : మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ గౌడ్ కేసులో తమపైనా కేసుల నమోదుకు కోర్టు ఆదేశించడంతో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగబద్దంగా ఏర్పడ్డ వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసంది. రాజ్యాంగ వ్యవస్థలపై కేసులు నమోదుకు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసి.. జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అసలు ఏం జరిగిందంటే ?
2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తో పాటు అఫిడవిట్ ను సమర్పించారు. వాటిని ఈసీ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసింది. తర్వాత ఆ అఫిడవిట్ మారిపోయిందని... పాతది డిలీట్ చేసి కొత్తది అప్ లోడ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇలా ట్యాంపరింగ్ చేయడపై ఫిర్యాదు చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన చలువగాలి రాఘవేంద్ర రాజు హైదరాబాద్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టు ఆగ్రహం
కోర్టు ఆదేశాలతో మహబూబ్ నగర్ పోలీసులు మొదట కేసులు నమోదు చేయలేదు. దీంతో పది రోజుల కిందట కోర్టు ఆదేశించినప్పటికీ కేసు నమోదు చేయలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు చేశారో? లేదో? చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు నమోదు చేస్తే ఎఫ్ఐఆర్ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కేసు నమోదు చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని మహబూబ్ నగర్ పోలీసులకు జడ్జి హెచ్చరించారు. కోర్టు హెచ్చరికలతో..ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించడంతో మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులు స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 10 మంది అధికారులపై గత శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కేసు నమోదైన పది మంది ఎవరంటే ?
కోర్టు ఆదేశించినట్లుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 10 మంది ప్రభుత్వ అధికారులను నిందితులుగా చేర్చారు. అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ , అప్పటి స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్ , అప్పటి మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎన్నికల కమిషన్‌కు చెందిన అధికారులతోపాటు మొత్తం 10 మంది అధికారులపై కేసులు నమోదు చేశారు. కానీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలపై ఇలా కేసుల నమోదుకు ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమని భావించిన సుప్రీంకోర్టు జడ్జిని సస్పెండ్ చేసింది.