IT Raids: పొంగులేటి ఇళ్లలో రెండో రోజు కొనసాగుతోన్న సోదాలు - కీలక పత్రాలు స్వాధీనం
Telangana News: పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని నివాసంలో కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
IT Raids On Ponguleti Srinivas Reddy: మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాతోపాటు హైదరాబాద్ లోని మొత్తం 30 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం సోదాలు ముగిసిన అనంతరం పొంగులేటిని హైదరాబాద్ తీసుకెళ్లారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.17లో ఉన్న 222/a ఇంట్లో, పొంగులేటి బంధువు, నందగిరి హిల్స్ లోని బంధువుల ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి గది తాళాలు లేకపోవడంతో పొంగులేటి సతీమణికి ఆ గది తాళాలు కావాలని ఫోన్ చేసి అడిగారు. ప్రస్తుతం అన్ని చోట్లా సోదాలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
ఉత్కంఠ మధ్య నామినేషన్
కాగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. తెల్లవారుజామునే ఐటీ, ఈడీ అధికారులు ఆయన ఇళ్లపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పొంగులేటి అభిమానులు, అనుచరులు పెద్దఎత్తున ఖమ్మంలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. గేటు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పొంగులేటి ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. తాను నామినేషన్ వేసే రోజున భయపెట్టేందుకు ఇలా చేస్తున్నారంటూ పొంగులేటి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేషన్ వేస్తానని, లేకుంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై ఉత్కంఠ నెలకొనగా, పొంగులేటి నామినేషన్ వేసేందుకు ఓ 2 గంటలు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో తన అనుచరులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
దాడులు ఇలా
గురువారం ఉదయం నుంచే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు , కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వేకువజామున 4 గంటలకు 8 వాహనాల్లో వచ్చిన అధికారులు మూకుమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటితో పాటు ఆయనకు సంబంధం ఉన్న వివిధ కంపెనీల్లో సోదాలు చేశారు. పొంగులేటి కుమారుడి ఇంట్లో, హైదరాబాద్ నందగిరిహిల్స్‌లోని జ్యోతి హిల్‌రిడ్జ్, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లో ఐటీ సోదాలు సాగాయి. గురువారం ఉదయం ఏకకాలంలో 30 చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు. కాగా, తనపై ఐటీ దాడులు జరిగొచ్చని పొంగులేటి 2 రోజుల క్రితమే చెప్పారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఆయన ఇలా అన్న రెండు రోజుల్లోనే ఐటీ అధికారులు రైడ్స్ షురూ చేశారు.
కాంగ్రెస్ నేతల ఆగ్రహం
పొంగులేటి ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా, ఇతర అగ్రనేతలు సైతం ఖండించారు. ప్రతిపక్షాలపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరగవని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పొంగులేటి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ దాడులపై పొంగులేటి ఈసీకి ఫిర్యాదు చేశారు. కుట్ర పూరితంగానే ఈ సోదాలు చేస్తున్నారని, తన నామినేషన్ అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఎన్నికల అధికారుల దృష్టికి తెచ్చారు.
Also Read: Telangana BJP Candidate Final List: తెలంగాణలో పోటీకి 14 మందితో ఫైనల్ జాబితా విడుదల చేసిన బీజేపీ