Telangana BJP : తెలంగాణ అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు- ప్రజల్లోకి సూటిగా వెళ్లేలా ప్లాన్
Telangana BJP Tagline: "తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం" అనే ట్యాగ్ లైన్ తో బీజేపీ పావులు కదుపుతోంది. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో గెలవాలని కసరత్తులు చేస్తోంది.
Telangana BJP Tagline: "తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం" అనే ట్యాగ్ లైన్ తో బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా గోడలపై కమలం పువ్వు గుర్తు, ఎన్నికల ట్యాగ్ లైన్ తో రాతలు రాయిస్తోంది. ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో కనీసం ఐదు చోట్ల వాల్ రైటింగ్ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో ఒకే ఫార్మాట్ లో వాల్ రైటింగ్ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలోనే పలు చోట్ల గోడలపై రాతలు రాయించే కార్యక్రమం చేపట్టారు. గోడలపై.. తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం అంటూ రాస్తుండడంతో రాజకీయ హీట్ మరంత పెరిగింది. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే బీజేపీ పార్టీ ఈ రేంజ్ లో ప్రణాళికలు రూపొందిస్తుండడంతో మిగతా పార్టీలు కూడా సన్నాహాలు మొదలు పెట్టాయి.
కర్ణాటక, తెలంగాణలో బిజెపి సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుంది- అమిత్ షా, తెలంగాణలో డబల్ ఇంజిన్ సర్కారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు-బండి సంజయ్. pic.twitter.com/Pa9wzK8q2a
— BJP Telangana (@BJP4Telangana) April 25, 2023
మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రెండ్రోజుల క్రితం చేవెళ్ల బహిరంగ సభలో ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని దిల్లీలో ప్రధాని మోదీకి వినిపడేలా నినదించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 9 ఏళ్లుగా బీఆర్ఎస్ అవినీతి పాలన చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై మాట్లాడిన అమిత్ షా... ఏ తప్పు చేయకుండా బండి సంజయ్ అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులకు బీజేపీ ఎప్పుడూ భయపడదన్నారు.
కేసీఆర్ అవినీతి పాలన అంతానికి కౌంట్ డౌన్ స్టార్ట్
" తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోంది. ఏ పరీక్ష పెట్టినా పేపర్ లీక్ అవుతోంది. పేపర్ లీకేజీలపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పందించలేదు. పేపర్ లీక్ ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలను మోదీ నుంచి దూరం చేయలేరు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఈ మహాసభ తెలియజేస్తోంది. బీఆర్‌ఎస్ అవినీతి పాలన అంతం కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. కేసీఆర్ మీ దౌర్జన్యాలకు ప్రజలు భయపడరు, ఇప్పుడు మిమ్మల్ని గద్దె దించే వరకు వారి పోరాటం కొనసాగుతుంది. జాగ్రత్తగా వినండి కేసీఆర్! దురదృష్టవశాత్తు తెలంగాణలో, పోలీసు, పరిపాలన పూర్తిగా రాజకీయకోణంలో జరుగుతోంది. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలోనే ఆపేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభివృద్ధిని దూరం చేస్తున్నారు. "- అమిత్ షా