Telangana Aasara Pensions: ఆసరా పెన్షన్లు తొలగింపు నిజమే, కోతకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ - మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy on Aasara Pension: బీఆర్ఎస్ హయాంలో ఎవరైనా పైరవీ చేసి, అనర్హులు ఆసరా పింఛన్లు అందుకున్నట్లయితే తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Ponguleti Srinivas Reddy comments on Aasara Pensions | ఖమ్మం: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు ఇస్తుందని అంతా భావించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇదివరకే రాష్ట్ర మంత్రులు పలు సందర్భాలలో ప్రస్తావించారు. అర్హులైన లబ్ధిదారులు పథకాల కోసం ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి షాకింగ్ న్యూస్ చెప్పారు. వెరిఫై చేసి లబ్ధిదారులల్లో కొందరి పింఛన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో ఆసరా పెన్షన్ తొలగిస్తారని పెన్షన్ లబ్ధిదారులు, ఇతర పథకాల లబ్ధిదారుల్లో సైతం ఆందోళన మొదలైంది. ఆసరా పెన్షన్లపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పెన్షన్లపై పరిశీలన
అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందుతాయని, ఇప్పటివరకూ కొనసాగుతున్న ఆసరా పెన్షన్లపై పరిశీలన చేస్తామన్నారు పొంగులేటి. ఎవరైనా పైరవీ చేసి ఆసరా పింఛన్ పొందుతున్నట్లు గుర్తిస్తే వారి పెన్షన్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కొందరు పైరవీ చేసి పెన్షన్లు తెచ్చుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి పెన్షన్ల తొలగింపు కేవలం ఖమ్మం జిల్లాకు మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుందని మంత్రి చెప్పారు. పెన్షన్ల జారీలో పైరవీలు ఎలా సాధ్యం అవుతుంది, అనర్హులకు ఆసరా పింఛన్ ఎలా ఇస్తామని ప్రశ్నించారు.
మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో టెన్షన్ టెన్షన్!
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తరువాత మంత్రి పొంగులేటి ఆసరా పెన్షన్లపై చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. పెన్షన్లలో కోతలు తప్పవు అని పొంగులేటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు తమ పెన్షన్లు ఎక్కడ తొలగిస్తారేమోనని అవ్వా తాతల్లో ఆందోళన మొదలైంది. అయితే అనర్హుల పింఛన్లు మాత్రమే రద్దు అవుతాయని, వారికి సంక్షేమ పథకాలు సైతం నిలిచిపోతాయని మంత్రి పొంగులేటి వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది.
మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారికి మొదటి విడతలో ఇళ్ల నిర్మాణం మొదలవుతుందని శుభవార్త చెప్పారు. రెండో విడతలో ఇళ్ల పట్టాలతో కూడిన నిర్మాణం పూర్తిచేసి అందిస్తామని పొంగులేటి తెలిపారు. తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.