Congress Sharmila News : షర్మిల చేరికపై తెలంగాణ కాంగ్రెస్ లైట్ - ఒక్కరూ పట్టించుకోలేదు !
Sharmila : షర్మిల చేరిక కార్యక్రమంలో తెలంగాణ నేతలు కనిపించలేదు. తెలంగాణ విషయంలో షర్మిల ప్రమేయం అసలు లేదని..ఇక ఉండదని సంకేతాలు పంపినట్లయింది.
Sharmila Joininig Program : వైఎస్సాఆర్టీపీని గురువారం షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేశారు. షర్మిల చేరిక సందర్భంగా వేదికపై తెలంగాణ నేతలు కనిపించలేదు. ఏఐసీసీ ఆఫీసులోనే సీఎం రేవంత్ రెడ్డి సహా టీ కాంగ్రెస్ నేతలు ఉండిపోయారు. ఎవరూ వేదికపైకి రాలేదు. కాంగ్రెస్ వైఎస్సాఆర్టీపీ విలీనానికి టీపీసీసీ నేతలు దూరంగా ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వేదికపై ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు సహా సీనియర్ నేతలు మాత్రమే కనిపించారు. ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలోనే విలీనం జరిగింది.
షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. ఆమె వల్ల సమస్యలు వస్తాయని అనుకున్నారు. అందుకే విలీన ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు విలీన ప్రక్రియకు హాజరు అయితే షర్మిలకు తెలంగాణలో బాధ్యతలు ఇస్తారేమోనన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని.. అందుకే వెళ్లాల్సిన అవసరం లేదన్నట్లుగా ఆ నేతలు ఉండిపోయారని తెలుస్తోంది. ఈ పరిణామంతో షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారని సంకేతాలు పంపినట్లయింది. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షర్మిల మద్దతు తెలిపారు. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలకూడదని బరిలో నుంచి తప్పుకున్నారు. తాను పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని షర్మిల చెబుతున్నారు. అయితే ఆమె పార్టీ విలీనంపై మాత్రం .. తెలంగాణ నేతలు ఎవరూ ఆసక్తి చూపించ లేదు.
షర్మిల ఈ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నారు. దీనికి ముందే కాంగ్రెస్ లో విలీనం ప్రక్రియ కూడా జరగలేదు. ఒకవేళ కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనమై.. ఆమెను తెలంగాణలో ప్రచారానికి తిప్పి ఉంటే.. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ చక్కగా ఉపయోగించుకునేది. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కూతురు వస్తోంది అంటూ ప్రచారం చేసేవారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ వంటి వారు ఇలాంటి అవకాశం కోసమే కాచుకుకూర్చుని ఉన్నారు. షర్మిల సొంతంగా పోటీ చేసినా ఇదే ప్రచారం చేసేవారే. అయితే, దీనికి అవకాశం ఇవ్వకుండా చేశారు రేవంత్. టీపీసీసీ చీఫ్ గా ఆయన షర్మిల పార్టీ విలీనాన్ని వ్యతిరేకించారని చెబుతారు. ఒకవేళ ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత చూసుకుందాం అని అధిష్ఠానానికి చెప్పారని అంటారు.
ఇప్పుడు ఎన్నికల తర్వాత విలీనం చేసినా తెలంగాణపై ష్రమిల ముద్ర వద్దని.. ఏపీలో రాజకీయాలకు కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పి ఉంటారని అంటున్నారు. విలీనం ఆగిపోయినా కర్ణాటక డిప్యూటీ సిఎం డికె.శివకుమార్ వంటి వారు షర్మిలను ఎన్నికల బరి నుంచి వైదొలగేలా చేయగలిగారు. ఆమె రాజకీయ భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఒప్పించారు. దీంతో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీయకూడదనే ఉద్దేశంతో తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించారు. ఇప్పుడు పార్టీలో విలీనం చేసినా .. తెలంగాణకు మాత్రం దూరంగా ఉండాని సంకేతాలు పంపారు.