Sridhar Babu Jeddah Road Show: జెడ్డాలో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షో, మంత్రి శ్రీధర్ బాబు కీలక సమావేశాలు
Investments in Telangana: దావోస్‌లో వచ్చిన పెట్టుబడులకు అదనంగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు జెడ్డాలో మంత్రి శ్రీధర్ బాబు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షో నిర్వహించనున్నారు.
Sridhar Babu to visit Jeddah to attract investments: హైదరాబాద్: తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇదివరకే దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో దాదాపు రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల కోసం ఆయా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. మరిన్ని పెట్టుబడుల కోసం దావోస్‌కు కొనసాగింపుగా మంత్రి శ్రీధర్ బాబు సౌదీ అరేబియా దేశంలో పర్యటిస్తున్నారు. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షో లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొనున్నారు.
జెడ్డాలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీకానున్న మంత్రి శ్రీధర్ బాబు
జెడ్డాలో ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సమావేశమవుతారు. 10 గంటల నుంచి 11 గంటల వరకు జెడ్డా ఛాంబర్స్ తో భేటీ జరగనుంది. అనంతరం ఆహార ఉత్పత్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరుపుతారు.
మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి ఒంటిగంట వరకు సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో, బోర్డ్ సభ్యులతో భేటీ అవుతారు. ఆ తర్వాత పట్రోమిన్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఆ సంస్థ ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులుపై చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు బట్టర్జీ హోల్డింగ్ కంపోనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతో సమావేశం కానున్నారు. అరాంకో సంస్థ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. అనంతరం అదేరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు షెరటన్ హోటల్ లో జరిగే ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షో లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొనున్నారు.
ఈ సమావేశాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గానూ ఉన్న అనువైన సానుకూల వాతావరణం, పరిస్థితులను గురించి మంత్రి శ్రీధర్ బాబు వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలు, ఇతర సహాయ సహకారాల గురించి అవగాహన కల్పిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చలు జరుపుతారు. మంత్రి శ్రీధర్ బాబు వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఉంటారు.
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సక్సెస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సక్సెస్ అయింది. రేవంత్ టీమ్ దావోస్ పర్యటనతో రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు అని అధికారులు తెలిపారు.
ఒప్పందాలు చేసుకున్న కంపెనీలివే..
అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.