MLA Poaching Case : బీఎల్ సంతోష్‌కు నోటీసులపై స్టే పొడిగింపు - ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామాలు !
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ , జగ్గు స్వామీలకు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే పొడిగించింది. మరో వైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను కోర్టులో సిట్ నమోదు చేయించింది.
MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ , కేరళ వైద్యుడు జగ్గు స్వామికి సిట్ ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే ను హైకోర్టు పొడిగించింది. ఈనెల 22 వరకు స్టే పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన టైం లో కేవలం A1 నుంచి A3 నిందితులు మాత్రమే ఉన్నారని.. ఆ రోజున బీఎల్ సంతోష్, జగ్గు స్వామి ఇద్దరూ ఫాం హౌస్ లో లేరని వారి తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లో ఫొటోలు , వాట్సాప్ చాట్ ఆధారం తో ఎట్ల కేసులో నిందితులుగా చేర్చుతారని ప్రశ్నించారు. నేరస్తుల జాబితాలో ఉన్న ప్రతిపాదిత నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చాలని మెమో దాఖలు చేసినా కోర్టు తిరస్కరించిదన్నారు.
22 వరకూ నోటీసులపై స్టే పొడిగింపు
రివిజన్ పిటిషన్ పై సింగిల్ బెంచ్ ఇంకా తీర్పు ప్రకటించాల్సి ఉందన్నారు. సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పును ప్రకటించక ముందే బీఎల్ సంతోష్, జగ్గు స్వామిలను నిందితులుగా చేర్చాలని ఏజీ కోరడం విడ్డూరంగా ఉందని వారి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెల్లారు. దీంతో ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమో కాపీ ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి కోరారు. దాన్ని పరిశీలించిన అనంతరం స్టే గడువును పొడిగించారు.
సాక్ష్యాలు లేకపోయినా సిట్ వేధిస్తున్నారని నిందితుల తరపు లాయర్ల వాదన
ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీనివాస్, రామచంద్రభారతి తరుపు న్యాయవాదులు కూడా కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ పేరుతో పోలీసులు టార్చర్ చేస్తున్నారని శ్రీనివాస్ తరుపు న్యాయవాది వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా శ్రీనివాస్ సహా అతడి కుటుంబాన్ని వేధిస్తున్నారని చెప్పారు. బండి సంజయ్, రఘునందన్రావు పేరు చెపితే 5 నిమిషాల్లో విచారణ పూర్తవుతుందని సిట్ అధికారులు బెదిరిస్తున్నారని..రఘునందన్ రావుతో శ్రీనివాస్కు పరిచయం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ఉద్ధేశ్యపూర్వకంగా మల్టిపుల్ కేసులు నమోదు చేస్తున్నారని రామచంద్రభారతి తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఇదే కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని దాఖలైన పిటిషన్ పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
కోర్టులో పైలట్ రోహిత్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేయించిన పోలీసులు
మరో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు పైలట్ రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి సమక్షంలో 164 సీఆర్పీసీ కింద పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తాను బీజేపీలో చేరితే రూ. 100 కోట్లు ఇస్తామని నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతిలు ఆఫర్ చేశారంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీలో చేరాలని తనపై ముగ్గురు ఒత్తిడి తెచ్చారని, డీలింగ్ లో భాగంగానే వాళ్లు తన ఫామ్ హౌస్ కు వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశాలపై ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.