MP Raghu Rama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత
MP Raghu Rama Krishna Raju : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గచ్చిబౌలి పీఎస్ లో దాఖలైన కేసు కొట్టివేయాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు.
MP Raghu Rama Krishna Raju : ఎంపీ రఘురామ కృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై, తన కుమారుడిపై గచ్చిబౌలి పీఎస్ లో దాఖలైన కేసు కొట్టివేయాలని ఎంపీ రఘురామ పిటిషన్ వేశారు. పిటిషన్ కొట్టివేతకు హైకోర్టు నిరాకరించింది. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను ఇంట్లో నిర్భందించి దాడిచేశారని ఏపీ పోలీసులు ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని కోర్టు తెలిపారు పోలీసులు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది సైతం సస్పెండ్ అయ్యారని కోర్టుకు తెలిపారు. పోలీసుల వాదనతో ఏకభవించిన హైకోర్టు, రఘురామ పిటిషన్ కొట్టివేసింది.
అసలేం జరిగింది?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు ఎంపీ రఘురామ సిద్ధం అయ్యారు. అయితే అనూహ్యంగా విరమించుకున్నారు. ట్రైన్ లో భీమవరం బయలుదేరిన ఆయన... మార్గమధ్యలోనే ట్రైన్ దిగిపోయారు. తన అనుచరులను ఏపీ పోలీసుల అరెస్టు చేసి ఇబ్బందులు పెడుతున్నారని వారి కోసం తన పర్యటనను విరమించుకుంటున్నట్లు తెలిపారు. అలాగే తనను ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఫాలో అవుతున్నారని ఆరోపించారు. ఈ పరిమాణాల మధ్య హైదరాబాద్ లో ఎంపీ రఘురామ ఇంటి వద్ద అనుమానాస్పద రీతిలో తిరుగుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని ఎంపీ రఘురామ వ్యక్తిగత సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా అతడు ఎంపీపై కేసు పెట్టాడు. తన విధులకు ఆటంకం కలిగించారని, తనను అక్రమంగా నిర్బంధించారని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
ఎంపీ రఘురామపై కేసు
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఎంపీ రఘురామపై కేసు నమోదైంది. ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్‌కే ఫరూక్ బాషా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్ హిల్స్ వద్ద ఉంటే కారులో నలుగురు వ్యక్తులు వచ్చి, తనను బలవంతంగా ఎక్కించుకొని ఎంపీ రఘురామ ఇంటికి తీసుకువెళ్లి దాడి చేశారని ఫిర్యాదులో బాషా పేర్కొన్నారు. తన పర్సు, ఐడీ కార్డు కూడా లాక్కున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎంపీ రఘురామతోపాటు ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుల్‌ను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసు విషయంపై ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. కేసు కొట్టివేయాలని కోరారు. అయితే హైకోర్టు అందుకు తిరస్కరించింది.