Nandi Awards: నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు: రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
Telangana Nandi Awards Name Change: నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రదానం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Nandi Awards as Gaddar Awards: హైదరాబాద్: సినీ రంగానికి ఇచ్చే నంది అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినీ ప్రముకులు నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామన్నారు. కళాకారులకు గద్దర్ పేరుతో పురస్కారాలు ఇచ్చి గద్దరన్నకు గౌరవించుకుందాం అన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే డాది ఏనుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని వెల్లడించారు. కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డును ప్రదానం చేస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది గద్దరన్న అని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు మాకు స్ఫూర్తి.. ఆయనతో మాట్లాడితే మాకు 1000 ఏనుగుల బలం వస్తుందన్నారు. ఆ బలంతోనే గడీల ఇనుప కంచెల బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్ గా మార్చినట్లు తెలిపారు.
ఏ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారో... తమ ప్రజా ప్రభుత్వంలో ఆ దళితుడికే వచ్చి ఎమ్మెల్సీ కవిత పూలే విగ్రహం కోసం వినతిపత్రం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం, కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు శపనార్ధాలు పెడుతున్నారు. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారు. అలాంటి ఆలోచన చేసిన వారిని తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా అలాచించడం వాళ్ల ఒంటికి.. ఇంటికి మంచిది కాదన్నారు. ఇది ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని, రానున్న ఐదేళ్లు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత తమపై ఉందన్నారు.