Telangana News: తెలంగాణ వాహనదారులకు అలర్ట్ - అలా చేస్తే లైసెన్స్ రద్దు
TS To TG Number Plates: తెలంగాణ వాహనదారులకు రవాణా శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Telangana Trasnport Department Warns On Number Plates: తెలంగాణ రవాణా శాఖ (Telangana Transport Department) వాహనదారులకు కీలక సూచనలు చేసింది. వాహన నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వాహన కోడ్‌ను టీఎస్ (TS) నుంచి టీజీగా (TG) మార్పు చేసింది. ఈ మార్పునకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోద ముద్ర వేసింది. ఈ ఉత్తర్వులు జారీ అయిన నాటి నుంచి కొత్త వాహనాలకు టీజీ నెంబర్ ప్లేట్ వస్తోంది. అయితే, ఇటీవల కొందరు తమ వాహనాల నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. పాత నెంబర్ ప్లేట్లను మారుస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఎవరైనా పాత వాహన నెంబర్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్‌ను టీజీగా మారిస్తే ట్యాంపరింగ్‌గా భావించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లైసెన్స్ సైతం రద్దు చేసే ఛాన్స్ ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి కొన్న కొత్త వాహనాలకు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర సంస్థలకు తెలంగాణ స్టేట్ (TS) అని పెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, టీఎస్ బదులుగా టీజీ అని పెట్టాలని అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్‌ను టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.