Telangana : వాళ్లందరి దగ్గర రైతుబంధు రికవరీ - ఇవ్వకపోతే కేసులే - రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
CM Revanth Reddy : వెంచర్లకు ఇచ్చిన రైతు బంధును వెనక్కి తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నారు.
Rythu Bandhu : వ్యవసాయం చేయకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా భూములను మార్చిన వారు తీసుకున్న రైతు బంధు పథకం నిధులను వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. రేపో మాపో.. రైతుబంధు నిధుల రికవరీకి సంబంధించి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయనున్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ భూములన్నింటికీ రైతు బంధు వర్తింప చేశారు. అయితే వ్యవసాయ భూముల్లో చాలా వరకూ వెంచర్లుగా మార్చారు. వాటిలో వ్యవసాయం చేయడం లేదు. ఆ విషయంపై ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక రావడంతో పథకం కింద ఇచ్చిన డబ్బులన్నీ రికవరీ చేయాలని నిర్ణయించారు. అధికారిక ఆదేశాలు త్వరలో విడుదల కానున్నాయి.
రైతు బంధు పథకంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు
రైతు బంధు పథకంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. రైతుభరోసాగా మార్చి అమలు చేయనున్నారు. ఈ పథకం ఉద్దేశం పూర్తి స్థాయిలో రైతులకు పెట్టుబడి సాయం అందేలా చూడటం. అయితే రైతులు కాని వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా రైతు బంధు కింద పెద్ద ఎత్తున సాయం పొందారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే.. జిల్లాల కేంద్రాల్లో పెద్ద ఎత్తున భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్చేశారని వాటికి కూడా రైతు బంధు కింద సాయం అందిందని చెబుతున్నారు. వందల ఎకరాలున్న రియల్ ఎస్టేట్ కంపనీల ఖాతాల్లోనూ నగదు జమ అయిందని అంటున్నారు.
నిధులు పేదలకు అందాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణ
ఇప్పుడు ప్రజాధనం పూర్తి స్థాయిలో పేదలకు..అర్హులకే అందాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో జరిపిన పరిశీలనలో అనర్హులకు వ్యవసాయం చేయని వారికి నిధులు అందినట్లుగా గుర్తించారు. ఇందులో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండటంతో ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. మొత్తంగా పథకం అమలు చేసినప్పటి నుండి తీసుకున్న డబ్బుల్ని రికవరీ చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు సమకూరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మోతుబరి రైతులకు రైతు బంధు అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో90 శాతానికిపైగా రైతులు 5 ఎకరాలలోపు ఉన్న వారేనని వారికి ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారు.
రుణమాఫీతో పాటు రైతు భరోసా నిధులు
ఆగస్టు పదిహేనో తేదీ కల్లా రుణమాఫీ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే సందర్భంలో .. రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా పంపిణీ చేయాల్సి ఉంది. విధి విధానాల ఖరారుకు వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల రైతు బంధు సొమ్మును తిరిగి ఇవ్వకపోతే.. రెవిన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.