(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Ooty: ఆ ప్రకృతి అందాలు వర్ణించలేం - తెలంగాణ సరిహద్దులో ఊటీని చూసొద్దామా!
Telangana Tourist Places: ఆ రహదారి గుండా వెళ్తుంటే ప్రకృతి ఒడిలో సేద తీరుతాం. ఎత్తైన కొండలు, భారీ వృక్షాలు, పొలాల మధ్యలో ఆ ప్రయాణం ఓ మరిచిపోలేని అనుభూతి కలిగిస్తుంది. తెలంగాణ సరిహద్దులోని ప్రాంతం చూశారా.!
Telangana Tourist Place Chincholi: పచ్చని ప్రకృతి సోయగం.. ఎత్తైన కొండలు.. సుందరంగా జాలువారే జలపాతాలు.. మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణం.. ఏంటీ ఊటీ గురించో.. లేదా ఏ కోనసమీ ప్రాంతం గురించో అనుకుంటున్నారా..? ఇలాంటి ప్రకృతి అందాలను ఆస్వాదించేలంటే ఊటీ వరకూ వెళ్లక్కర్లేదు. మన తెలంగాణలోనే (Telangana) ఈ అద్భుత అందాలు నెలవై ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న చించోలి వన్య ప్రాణుల అభయారణ్యం (Chincholi), గొట్టంగుట్ట (Gottam Gutta) ప్రకృతి అందాలతో అలరారుతోంది. తెలంగాణకు సరిహద్దులో ఉండే ఈ ప్రాంతం నిజంగా 'ఊటీ'నే తలపిస్తోంది. ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి 2 గంటల్లోనే చేరుకోవచ్చు. అలాగే, కిలో మీటర్ల పొడవునా పచ్చదనం, సరస్సులతో పాటు గొట్టంగుట్టలోని మినీ జలపాతాలను చూసేందుకు సైతం రెండు కళ్లూ చాలవు. వారాంతాల్లో ఈ ప్రాంతంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందమైన అడవులు, వైల్డ్ లైఫ్ శాంక్చ్యుయరీ, గ్రీనరీ అన్ని టూరిస్టులకు ఓ మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి.
ప్రత్యేకతలివే..
తెలంగాణ - కర్ణాటక సరిహద్దులో ఉంది ఈ గొట్టంగుట్ట ప్రాంతం. కర్ణాటకలో ప్రవహించే భీమ నదికి దగ్గర్లోనే గొట్టంగుట్ట ఉంది. ఇక్కడ కొండల నుంచి జాలువారే జాబితాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దీనికి దగ్గర్లోనే చంద్రపల్లి అనే ఊళ్లో రిజర్వాయర్ ఉంది. అలాగే, గొట్టంగుట్టకు 10 కిలో మీటర్ల దూరంలో జాడి మల్కాపూర్ దగ్గర ఉన్న జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే, చించోలి అభయారణ్యంలో వన్యప్రాణుల సందర్శన, ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా అక్కడక్కడా ఆలయాలు, టూరిస్టుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పార్కులు.. వెరసి ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేసేందుకు కూడా చాలా బాగుంటుంది.
ఎలా చేరుకోవాలంటే.?
హైదరాబాద్ నుంచి 'గొట్టం గుట్ట' దాదాపు 120 కి.మీల దూరంలో ఉంది. అదే, జహీరాబాద్ నుంచి 25 కిలో మీటర్ల దూరం. రహదారి ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. పంట పొలాల మధ్యలో వంపులు తిరిగిన రహదారిలో ఆ ప్రయాణమే ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. అక్కడే స్టే చేయాలనుకునే వారికి సైతం జహీరాబాద్ తో పాటు, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోనూ హోటల్స్, రిసార్ట్ అందుబాటులో ఉంటాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత ఆహ్లాదంగా ఉంటుంది.
Also Read: హైదరాబాద్‌కు సమీపంలో హాట్ సమ్మర్‌లో కూల్‌గా వెళ్లగలిగే ప్రదేశాలు ఇవే