Telangana Elections Results 2023: ఈ ఓటమి 'కారు'కు స్పీడ్ బ్రేకర్ మాత్రమే - హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతిచ్చారన్న కేటీఆర్
KTR Comments: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఈ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటామని స్పష్టం చేశారు.
KTR Comments on Telangana Elections Results 2023: తెలంగాణ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 119 సీట్లకు గాను 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని తెలంగాణ ప్రజలు ఆదేశించారని, ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. స్వల్ప తేడాతో తమ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల ఓడిపోయారని, ఈ ఎదురు దెబ్బను పాఠంగా నేర్చుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రయత్నం చేసిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఓటమి 'కారు'కు చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దని సూచించారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారని అన్నారు.
కాంగ్రెస్ కు శుభాకాంక్షలు
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని తొందరపెట్టమని, వాళ్లు కుదురుకోవాలని, పని చేయాలని అన్నారు. ప్రజలకు 'హస్తం' పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పదేళ్లు ప్రభుత్వాన్ని అప్పగిస్తే సమర్థంగా నడిపామని, ప్రజలకు సేవలందించామని అన్నారు. 23 ఏళ్లలో అనేక ఎత్తు పల్లాలు చూశామని, ప్రజల దయతో పదేళ్లు అధికారంలో ఉన్నామని, ఈ ఎదురు దెబ్బను పాఠంగా నేర్చుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తాము చేసిన పని పట్ల సంతృప్తి ఉందని, ఓడిపోయామనే బాధ, అసంతృప్తి లేదని పేర్కొన్నారు. గతం కన్నా మెజార్టీ సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నామని, అయితే ఫలితాలు నిరాశ కలిగించాయని అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ కు మంచి మద్దతు ఇచ్చారన్న కేటీఆర్, ఎన్నికల్లో ఎంతో కష్టపడినా ఆశించిన ఫలితం రాలేదన్నారు. తెలంగాణ ప్రజల తీర్పును శిరసావహిస్తూ, సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేశారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ 'వేవ్' కాదు
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ 'వేవ్' కాదని కేటీఆర్ అన్నారు. 'ఇది కాంగ్రెస్ వేవ్ అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే ఫలితాలు రావాలి. కానీ అలా జరగలేదు. సింగరేణి ప్రాంతంలోనూ హస్తానికి సాధారణ మెజార్టీనే వచ్చింది. ఈ ఫలితాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల మన్నన పొంది మరింత బలంగా తిరిగొస్తాం. మార్పులు, చేర్పులతో మళ్లీ వస్తాం.' అని కేటీఆర్ వివరించారు.
ప్రజా గొంతుకై ప్రశ్నిస్తాం
అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించామో, ప్రతిపక్ష పాత్రలోనూ అంతే బాధ్యతగా వ్యవహరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తామని అన్నారు. తమకు అడుగడుగునా అండగా నిలబడ్డ, సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఎంతగా పోరాడి సాధించామో, అదే పోరాట స్ఫూర్తితో, మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.
Also Read: Telangana Elections Results 2023: తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగినా వీళ్ల ఓటమి మాత్రం పెద్ద షాక్