Sharmila Letter To Rahul Gandhi: బీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యం, అదే చారిత్రక అవసరం: రాహుల్ కు షర్మిల లేఖ
YS Sharmila Supports Congress : బీఆర్ఎస్ నీచపాలన అంతం కోసం ఎటువంటి కఠిన నిర్ణయానికైనా తాను సిద్ధమని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
YS Sharmila Supports Congress :
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల నుంచి వైఎస్సార్ టీపీ తప్పుకోవడం తెలిసిందే. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకూడదని భావించి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షర్మిల లేఖ రాశారు. బీఆర్ఎస్ నీచపాలన అంతం కోసం ఎటువంటి కఠిన నిర్ణయానికైనా తాను సిద్ధమన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి రౌడీరాజ్యం అంతమొందించగలిగే కాంగ్రెస్ ఓటుచీల్చవద్దనే ఈ త్యాగం చేశానని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ బాగు, భవితకోసం YSR తెలంగాణ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగుతోందని ట్విట్టర్ (ఎక్స్)లో షర్మిల పోస్ట్ చేశారు.
‘చరిత్రను గుర్తుంచుకోవడానికి సమయం మనకు అవకాశం ఇస్తుంది. అదే సమయంలో పొలిటికల్ ఇంట్రెస్ట్ కన్నా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయడం ఉత్తమమని భావిస్తున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో ఈ రోజు త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను. త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికలలో పోటీ నుంచి వైదొలగాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించుకుంది. మా పార్టీ ఓటు బ్యాంకు కారణంగా కాంగ్రెస్ ఓట్లు చీలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణను కాపాడుకోవాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు తెరదించేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ కోసం నేనెప్పుడూ నిలబడతాను, అందులో భాగంగా నిర్ణయానికి కట్టుబడి వైఎస్సార్ టీపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని’ వైఎస్ షర్మిల కోరారు.
రాహుల్ గాంధీకి షర్మిల రాసిన లేఖలో ఏముందంటే..
‘నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా రాష్ట్రాన్ని ఓ కుటుంబం దోచుకుంది. రాష్ట్ర సంపదను ఓ కుటుంబానికి సొంతమైంది. ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ కేసీఆర్, ఆయన సన్నిహితుల దురాశ కారణంగా నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదు.
ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ చీలకూడదు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని పూర్తి మద్దతు తెలుపుతున్నాం. బీఆర్ఎస్ ను ఓడించి సరికొత్త చరిత్ర లిఖించేందుకు సమయం ఆసన్నమైంది. వైఎస్సార్ టీపీ పోటీ వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు దెబ్బతినే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. దాంతో ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని ఎన్నికల నుంచి తప్పుకోవడంతో పాటు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరగాలి. మా పార్టీ శ్రేణులు కాంగ్రెస్ విజయం కోసం కృషిచేస్తారని’ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొలైంది. ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో నవంబర్ 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు సమర్పించవచ్చు. అయితే ఒక సెట్ డిపాజిట్ నగదు చెల్లిస్తే సరి.