(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Elections 2023: 'కాంగ్రెస్ మేనిఫెస్టోతో బీఆర్ఎస్ భయపడుతోంది' - బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్ గల్లంతవుతుందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth reddy: కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి బీఆర్ఎస్ కు భయం పట్టుకుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు సహా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
Revanth reddy Slams BRS and BJP in Meet The Press: కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) చూసి బీఆర్ఎస్ (BRS) కు భయం పట్టుకుందని, అధికారం కోల్పోతున్నామనే సీఎం కేసీఆర్ ఆలోచన లేకుండా విచక్షణా రహితంగా మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanthreddy) మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు సహా మేనిఫెస్టోలో పొందు పరిచిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కాగా, ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవుతాయంటూ జోస్యం చెప్పారు. అసలు డిపాజిట్లే రాని పార్టీ బీసీని ఎలా ముఖ్యమంత్రిని చేస్తుందంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఒకరు మాత్రమే ఓబీసీ సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు.
'బీజేపీ పట్టించుకోలేదు'
బీసీ గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా, బీజేపీ పట్టించుకోలేదని, అలాంటి పార్టీ బీసీని ఎలా సీఎం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కోసమే ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చిందని, ఎన్నికలయ్యాక అసలు ఆ విషయమే బీజేపీ పట్టించుకోదని మండిపడ్డారు. బీజేపీ మాటలను దళితులెవరూ నమ్మరని అన్నారు. అటు, 'ధరణి' పేరుతో కేసీఆర్ కుటుంబం లక్షన్నర ఎకరాలను దోచుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు కేవలం 8 నుంచి 10 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. రైతు రుణమాఫీ చేయాలన్న శ్రద్ధ కేసీఆర్ కు లేదని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం ఆధిపత్య ధోరణితో ముందుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కేసీఆర్ ను గద్దె దించాలి'
పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని, అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలని, ప్రజలను బానిసల్లా చూస్తోన్న కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలోనూ నిపుణుల సలహాలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడడం కోసం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు.
'ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో'
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని, యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, విద్య, వైద్యం, వ్యవసాయం రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని, మహిళలకు చేయూత అందిస్తామని వివరించారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.