(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Elections 2023 : ఏ క్షణమైనా కాంగ్రెస్ రెండో జాబితా - 45 మంది పేర్లు ఖరారు చేశామన్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ !
కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఏ క్షణమైనా విడుదల కానుంది. రెండో జాబితాలో 45 మంది పేర్లు ఉండనున్నాయి.
Telangana Elections 2023 : రెండో జాబితాలో 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఢిల్లీలో ప్రకటించారు. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులకు వదిలేశామన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని.. చెరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో అంగీకారం కుదిరిందన్నారు. ఏ స్థానాలు ఇవ్వాలి అన్న విషయంపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని.. ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుందన్నారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట మిత్రపక్షలకు ఇచ్చే ప్రసక్తే లేదని మురళీధన్ స్పష్టం చేశారు.
దాదాపు 8 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక సమస్యగా మారింది. ఈ 8 సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది. సూర్యాపేటలో రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, డాక్టర్ రవి, ప్రీతం, మహేశ్వరంలో కేఎల్ఆర్, పారిజాతారెడ్డి, జడ్చర్లలో ఎర్ర శేఖర్, అనిరుధ్ రెడ్డి, మక్తల్‌లో శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి, ఉమేశ్ రావు, పరకాలలో కొండా మురళి, వెంకట్ రామిరెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఈ ఎనిమిది సెగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేయడం అధిష్టానానికి వదిలేశారు.
తెలంగాణ ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి మల్లిఖార్జున ఖర్గే.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పటాన్‌చెరు నుంచి బీఆర్‌ఎస్ తరపున టికెట్ ఆశించిన నీలం మధు.. అది దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌కు షాకిస్తూ కాంగ్రెస్ లో చేరిపోయారు.
కేసీఆర్‌ను గద్దె దింపేందుకే కాంగ్రెస్‌లో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. పదవులు తనకు ముఖ్యం కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్నారు. ‘‘కుటుంబ పాలనను అంతం చేస్తా. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోందన్నారు. కాంగ్రెస్ పకార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున నేతలు ఢిల్లీకి వస్తున్నారు. వారిలో ఎంత మందికి టిక్కెట్ ఇస్తారో స్పష్టత లేదు కానీ.. ఎక్కువ మంది తమకు అవకాశం లభిస్తుందన్న ఆశతోనే పార్టీలో చేరుతున్నారు. కొంత మంది టిక్కెట్ ఇవ్వకపోయినా పర్వాలేదని కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.
టిక్కెట్ల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రెండో జాబితాలో టిక్కెట్ కోసం పోటీ ఉన్న స్థానాలు ఎక్కువగా ున్నాయి. ఈ కారణంగా అసంతృప్తికి గురయ్యే నేతలు ఎక్కువగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి.