Nagam Janardhan Reddy: కాంగ్రెస్ కు బిగ్ షాక్, పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా
Telangana Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Telangana Assembly Elections 2023:
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగం నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ స్థానం ఆయనకు కంచుకోట లాంటిది. గతంలో పలుమార్లు టీడీపీ నుంచి విజయం సాధించి మంత్రిగానూ సేవలు అందించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన రెండో జాబితాలో నాగర్ కర్నూల్ టికెట్ తనకు దక్కపోవడంతో గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన ఆయన తన అనుచరులతో చర్చించిన తరువాత పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. నాగం జనార్దన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
బీఆర్ఎస్ లో చేరుతున్న కాంగ్రెస్ నేతలు!
కాంగ్రెస్ నంచి సీట్లు ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. నిన్న తన అనుచరులతో చర్చించిన తరువాత మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తనకు జడ్చర్ల లేక మహబూబ్ నగర్ నుంచి సీటు వస్తుందని ఆశించిన ఎర్ర శేఖర్ కు నిరాశే ఎదురైంది. దాంతో జడ్చర్చ మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఎర్ర శేఖర్ ను బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.
జడ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, మరోనేత అనిరుద్ రెడ్డి పోటీపడ్డారు. చివరికి అనిరుద్ రెడ్డికి కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ ఇచ్చింది. తనకు టికెట్ రాకపోవడంతో ఎర్ర శేఖర్ వర్గం అసంతృప్తికి లోనైంది. పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్ ఇవ్వడం లేదని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాను రెబల్ గా బరిలోకి దిగుతానని సైతం ఎర్ర శేఖర్ ప్రకటించారు. అయితే నేడు బీఆర్ఎస్ లో చేరడంతో ఆయన పోటీ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
టికెట్ దక్కలేదని కాంగ్రెస్‌కు గొట్టిముక్కల రాజీనామా, బాధతో కంటతడి
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా, ప్రతిసారి చివరి నిమిషంలో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని గొట్టిముక్కల భావించారు. కూకట్ పల్లి సీటు వస్తుందని భావించగా ఆయనకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో శుక్రవారం రెండో జాబితాను విడుదల చేసింది. కూకట్ పల్లి సీటును శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు పార్టీ కేటాయించడంతో మనస్తాపానికి గురైన గొట్టిముక్కల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
హాఫ్ టికెట్ గాళ్లకు సైతం టికెట్ అని ఘాటు వ్యాఖ్యలు
కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చేది లేదని చెప్పినా కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి హన్మంత రావు ఫ్యామిలీకి 2 టికెట్లు ఇచ్చింది. కానీ పీజేఆర్ కూతురు విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చి, కుమారుడు విష్ణువర్దన్ రెడ్డికి మొండిచేయి చూపింది. జూబ్లీహిల్స్ నుంచి తాను ఆశించిన టికెట్ ను మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇవ్వడాన్ని విష్ణువర్దన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. హాఫ్ టికెట్‌గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ.. కాంగ్రెస్ రెండో జాబితా విడుదలయ్యాక ఘాటు వ్యాఖ్యలు చేశారు.