Telangana Elections 2023 : తొమ్మిదిన్నరేళ్లలో అద్భుత ప్రగతి - ప్రాజెక్టులపై రాజకీయాలొద్దు - మంత్రి కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
Telangana Elections 2023 : మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడం చిన్న విషయమని దానిపై రాజకీయం చేసి తెలంగాణకు అన్యాయం చేయవద్దని కేటీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు.
Telangana Elections 2023 KTR : తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ రాష్ట్రంగా నిలిచిందని, జీఎస్‌డీపీలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై మంత్రి కేటీఆర్ పర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2014కు ముందు ఎట్లుండే తెలంగాణ 2023లో ఎట్లైంది తెలంగాణ అని గణాంకాలు, ఫొటోలతో వివరించారు.
Watch Live: BRS Party Working President and Minister @KTRBRS presents "Trailblazer Telangana," highlighting a decade of unprecedented development and welfare. https://t.co/nnyS8URVSp
— BRS Party (@BRSparty) November 23, 2023
తెలంగాణలో పెరిగిన ధాన్యం దిగుబడి
‘తెలంగాణలో పంటల దిగుబడి పెరింది. ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా మారింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నాం. దీనికోసం కోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా 58 లక్షల కుటుంబాలకు నీరు అందిస్తున్నాం. దీని స్ఫూర్తితో కేంద్రం ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకాన్ని ప్రారంభించింది. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరించాం. దీంతో ప్రతి గ్రామంలో చెరువులు నిండు కుండలా కనిపిస్తున్నాయి. సాగునీరు రావడంతో సంపద సృష్టించబడింది. నీళ్లు, నిధులు, నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ న్యాయం చేసింది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలను బలోపేతం చేశామని తెలిపారు.
రైతును రాజును చేసిన ఘనత
రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. సాగుకు 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. నల్లగొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేశాం. సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాలు కల్పించాం. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని నాలుగున్నరేండ్లలో పూర్తిచేశాం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు. కాల్వలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామన్నారు.
ప్రాజెక్టులను బద్నాం తెలంగాణకు అన్యాయం చేయవద్దు !
ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దు. ప్రాజెక్టులను బద్నాం చేసి అన్యాయం చేయొద్దు. బ్యారేజీల్లో సమస్యలు రావడం సర్వసాధారణం. ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయి. సాగర్ కట్టిన తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయి. రెండేండ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీటమునిగాయి. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు. కేంద్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నది. తెలంగాణకు అప్పులు పుట్టకుండా కుట్ర చేస్తున్నది. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. కరెంటు ఉండదు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply