Telangana Elections 2023: 'యాదాద్రి కంటే గొప్పగా భద్రాద్రి అభివృద్ధి' - మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ ధీమా
KTR Comments: తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భద్రాచలంలో రోడ్ షోలో పాల్గొన్నారు.
KTR Comments in Bhadrachalam Road Show: భద్రాచలం ప్రజలు చిన్న చిన్న అసంతృప్తులను పక్కన పెట్టి బీఆర్ఎస్ (BRS)ను ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్ (KTR) విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections 2023) ప్రచారంలో భాగంగా ఆదివారం భద్రాచలం (Bhadrachalam), ఇల్లెందు రోడ్ షోలో (Ellendu Roadshow) ఆయన పాల్గొన్నారు. 11 సార్లు అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ (Congress) ఏమీ చేయలేకపోయిందని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి విడతలోనే 24 గంటల విద్యుత్ ఇచ్చామన్నారు. కారణాలేమైనా భద్రాచలం ప్రజలు తమకు అవకాశం ఇవ్వలేదని, ఈసారి గులాబీ వనంలో భద్రాచలం చేరాలని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించాలని కోరారు. గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ అభ్యర్థి గెలవక పోవడం వల్ల గ్యాప్ వచ్చిందని, ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే భద్రాచలం రామయ్య ఆలయాన్ని యాదాద్రి కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు.
'ఆలోచించి ఓటెయ్యాలి'
గత పదేళ్లలో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కత్తి ఒకరికి ఇచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే ఎలా.? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల వేళ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోకుండా గులాబీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో భద్రాచలంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదని, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలని, కేసీఆర్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తున్నాయని వివరించారు. భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో పాత రికార్డులు మారాలని, గత 2 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్కో సీటు మాత్రమే వచ్చిందని, ఆ లెక్క ఇప్పుడు మారాలని కోరారు.
'ప్రజల తలరాతలు మార్చే ఎన్నికలు'
ఈ ఎన్నికలు ఆషామాషీ కాదని, ప్రజల తలరాతలు మార్చే ఎన్నికలని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని ప్రధాని మోదీ కుట్ర పన్నుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. దాన్ని అడ్డుకోవడం బీఆర్ఎస్ కే సాధ్యమని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు లాభాల్లో 34 శాతం వాటా ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని, ఈ సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. బీఆర్ఎస్ గెలిస్తే 15 రోజుల్లో కొమరారంను మండలంగా, ఇల్లందును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రూ.3 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు త్వరలో వస్తుందని చెప్పారు. భద్రాచలం రామయ్య దర్శనానికి వెళ్దామనుకున్నా, అధికారుల విజ్ఞప్తి మేరకు వెళ్లలేదని, తొందర్లోనే మళ్లీ వచ్చి భద్రాచలం రామయ్య దర్శనం చేసుకుంటానని కేటీఆర్ చెప్పారు.