Telangana Elections 2023: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు - రూ.20 లక్షల నగదు స్వాధీనం, పాతబస్తీలోనూ తనిఖీలు
IT Raids: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహా, హైదరాబాద్ లోని పలు వ్యాపారుల ఇళ్లల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
IT Raids on BRS MLA Pilot Rohit Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohitreddy) నివాసంలో ఐటీ అధికారులు శనివారం సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని (Tandur) రోహిత్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. ఆయన ఇంట్లో రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పాతబస్తీలోనూ వ్యాపారుల ఇళ్లల్లో
మరోవైపు, హైదరాబాద్ పాతబస్తీలోని పలు వ్యాపారుల ఇళ్లల్లో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లతో పాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్తలు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బు సమకూరుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు శాస్త్రిపురంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
వరుస దాడులు
కాగా, ఇటీవల పొలిటికల్ లీడర్స్ టార్గెట్ గా ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తొలుత కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహారెడ్డితొ మొదలైన దాడులు కేఎల్ఆర్, తర్వాత మంత్రి సబిత అనుచరులు, జానారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి ఇళ్లల్లోనూ కొనసాగాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు గడ్డం వినోద్, వివేక్ ఇళ్లు కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ దాడులపై ఆయా పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ తమను ఇబ్బంది పెట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
Also Read: Telangana Elections 2023: 'ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించొద్దు' - సీఎం కేసీఆర్ కు ఈసీ లేఖ