Ponguleti Srinivas Reddy: నేను నిజాయతీగా సంపాదించి ఖర్చు చేస్తున్న, కేసీఆర్ ఏం చేసి సంపాదించారో చెప్పాలి - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు.
'నేను నిజాయతీగా సంపాదించి రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నా.. మీరు ఏ వ్యాపారం చేసి సంపాదించారో చెప్పాలి' అని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పాలేరు సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి ఘాటు విమర్శలు చేశారు. ఖమ్మం సంజీవరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ...
ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఉచ్చరించడానికీ సీఎంకు నైతిక హక్కు లేదన్నారు. డబ్బుల మూటలతో వస్తున్నారని సీఎం కేసీఆర్ తనపై పరోక్ష ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేళ్ల కాలంలో అన్ని విధాలుగా దోచుకొని.. ఆ డబ్బుతో మదమెక్కి దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. తాను వ్యాపారం చేసి ప్రభుత్వానికి పన్ను కట్టి నిజాయతీగా సంపాదించి రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నానని.. కేసీఆర్ కుటుంబం ఏ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు సంపాదించారో చెప్పాలని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధమయ్యారని.. గెలిచిన తర్వాత విచారణ జరిపి తిన్న డబ్బు అంతా కక్కిస్తామని అన్నారు.
ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుంటే.. ఇప్పటి వరకు నింపుకున్న జేబులను బీఆర్ఎస్ వాళ్లు ఇప్పుడు దులుపుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎన్నితప్పుడు ప్రచారాలు చేసినా.. కోట్ల రూపాయలను కుమ్మరించినా.. తెలంగాణ ప్రజలు బీజేపీ, బీఆర్‌ఎస్ తోడు దొంగలను దుమ్ము దులపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ చూసి.. సీఎం కేసీఆర్ ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్లాది రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగారని ఆరోపించారు. నిన్నమొన్నటి వరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ మిత్ర పార్టీ బీజేపీ 40 శాతం కమీషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందని ధ్వజమెత్తారు. అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. వంద రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నట్లు పొంగులేటి వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను చూసి కేసీఆర్ కు చలి జ్వరం పట్టుకుంటే.. మంత్రి కేటీఆర్ ఏమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నారని పొంగులేటి ఎద్దేవా చేశారు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేదంటూ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రంపై గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో కల్వకుంట్ల స్కామ్‌ల గురించి చెప్పాలన్నారు.
దళిత బంధులో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నామని.. స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్న సంగతి గుర్తు చేశారు. పార్టీతెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను తమ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టారో.. ఎంత మంది తమ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో.. ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు తమ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో.. అన్నీ 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. లెక్కలతో సహా తేలుస్తామన్నారు. కాంగ్రెస్ అడ్డుకోవడం బీఆర్ఎస్ వల్ల కాదని పొంగులేటి విమర్శించారు.