Telangana Elections 2023: 'కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యం కాదు' - బీజేపీ మద్దతు పెరుగుతోందన్న కిషన్ రెడ్డి
Kishan Reddy: తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి బీజేపీ మద్దతు లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హామీలు ఆచరణ సాధ్యం కాదని విమర్శించారు.
Kishan Reddy Comments: తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు ఫేక్ అని, ఆ హామీలు ఆచరణ సాధ్యం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. నాంపల్లిలోని (Nampally) పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలు, షెడ్యూల్ తెగల ప్రజలు బీజేపీని విశేషంగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నామని, ఓ నిశ్శబ్ధ విప్లవం తరహాలో బీఆర్ఎస్ (BRS)ను ప్రజలు గద్దె దింపుతారని అన్నారు. దళితబంధు, రుణమాఫీ, బీసీ బంధు, దళిత ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చలేదని ప్రజలు ధైర్యంగా ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని సర్వే సంస్థలు దొంగ లీకేజీలు ఇస్తున్నా బీజేపీ అభ్యర్థులకు ఆదరణ తగ్గడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.
మేనిఫెస్టో పట్ల సానుకూలత
బీజేపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశామని, తమ హామీల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. బీసీని సీఎం చేయడం, ఇంధన ధరలపై వ్యాట్ తగ్గింపు, మహిళలకు 1 శాతం వడ్డీకే రుణాలు, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ, రైతులకు ఎరువుల సబ్సిడీ వంటి హామీలపై ఆకర్షితులవుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన వారు సైతం బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట ఇస్తే దాన్ని కచ్చితంగా అమలు చేస్తారని స్పష్టం చేశారు. మిగతా పార్టీల నేతలు ఇచ్చే హామీలు కోటలు దాటతాయని, కానీ వారు చేసే పనులు ప్రగతిభవన్, గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అనేక హామీలిచ్చిందని, కానీ అవేవీ నెరవేరలేదని విమర్శించారు. దేశ, రాష్ట్ర ప్రజలకు హస్తం పార్టీ విషాదమే మిగిల్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ కారణంగా తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా తమ మేనిఫెస్టోను రూపొందించామని కిషన్ రెడ్డి వివరించారు.
కేసీఆర్ అవినీతిపై విచారణ
బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అవినీతిపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగు పడిందని, వారు సంపదను దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని, ఆర్థికంగా కోలుకోలేని దుస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలిచ్చే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే సాధ్యమవుతుందని, అది బీజేపీయే కావాలని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని, బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Telangana Elections 2023: రూ.7.40 కోట్ల నగదు స్వాధీనం - 10 మందికి 41ఏ నోటీసులు