Telangana Election 2023 : ఇటలీకి పవన్ - తెలంగాణ బీజేపీతో పొత్తులు లేనట్లేనా ?
తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తులు మరోసారి సస్పెన్స్‌లో పడ్డాయి. వరుణ్ తేజ్ పెళ్లి కోసం పవన్ కల్యాణ్ ఇటలీ వెళ్లిపోయారు. మళ్ల నామినేషన్ల గడువు ప్రారంభమయ్యాకే వస్తారు.
Telangana Election 2023 : తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో అర గంట సేపు చర్చలు జరిపినా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు కేటాయిస్తారు.. ఏఏ సీట్లు ఇస్తారన్నదానిపై రెండు పార్టీల మధ్య అసలు సంప్రదింపులు జరగడం లేదు. మరో వైపు తన సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో జరుగుతూండటంతో కుటుంబసమేతంగా పవన్ కల్యాణ్ ఆ పెళ్లి కోసం ఇటలీ వెళ్లిపోయారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఒకటో తేదీన పెళ్లి జరుగుతుంది. రెండో తేదీన పవన్ కల్యాణ్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబంతో కొన్నాళ్లు అక్కడే గడుపుతారో తిరిగి వస్తారో స్పష్టత లేదు. కానీ మూడో తేదీ నుంచి తెలంగాణలో నామినేషన్లు ప్రారంభమవుతాయి. అప్పటికే పొత్తులు ఉంటే.. ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
జనసేన అభ్యర్థులు రెడీ - గ్రీన్ సిగ్నల్ వస్తే నామినేషన్లు
రాజకీయాల్లో పొత్తులు అంటే అంత సామాన్యమైన విషయం కాదు. సీట్ల సర్దుబాటు కోసం జరిపే చర్చలు రోజుల తరబడి సాగుతాయి. మరో వైపు నామినేషన్ల గడువు ముంచుకొస్తున్న సమయంలో ఎలాంటి సీట్ల చర్చలు ఇంకా జనసేన, బీజేపీ ప్రారంభించలేదు. పవన్ కల్యాణ్ మాత్రం తమ పార్టీ పోటీ చేసే స్థానాలను ఇప్పటికే ప్రకటించారు. 32 స్థానాల జాబితాను వెల్లడించారు. జనసేన తెలంగాణ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి అభ్యర్థులను కూడా ఫైనల్ చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో వారు పోటీ చేయడం ఖాయం. అయితే పొత్తుల కోసం బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చినందున.. అభ్యర్థుల ప్రకటనను ఇంకా ఫైనల్ చేయలేదని చెబుతున్నారు.
బీజేపీతో పొత్తుపై మొదట కిషన్ రెడ్డి సంప్రదింపులు
ఎన్డీఏలో భాగస్వామినని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతూంటారు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆయన అనుకోలేదు. చివరికి ఢిల్లీ స్థాయిలో బీజేపీ ఒత్తిడి తేవడంతో మద్దతు ప్రకటించారు. కానీ మద్దతును గుర్తించడానికి బీజేపీ నేతలు అంగీకరించలేదు. తర్వాత నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతివ్వలేదు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పోటీ చేయాలని ఆయన అనుకోలేదు. మొదటగా కిషన్ రెడ్డి పవన్ వద్దకు వచ్చి చర్చలు జరిపారు. గతంలోలా తమకు మద్దతు ఇవ్వాలని. .. లేకపోతే పొత్తులకు అంగీకరించాలని కోరారు. కానీ దీనిపై పవన్ ఎలాంటి స్పందన బహిరంగంగా వ్యక్తం చేయలేదు.
పొత్తులు ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపకూడదని పవన్ భావన
కిషన్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో అరగంట పాటు చర్చలు జరిపారు. కానీ మీడియాతో మాట్లాడలేదు. భేటీ అయిపోగానే ఇంకే బీజేపీ నేతతోనూ సమావేశం కాకుండా నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. దీంతో చర్చలు అంత సఫలీకృతం కాలేదని.. తెలంగాణలో పొత్తులు ఏపీపై ప్రభావం చూపకుండా ఉండాలని పవన్ కోరుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తంగా జనసేన పోటీ, పొత్తులపై నామినేషన్ల గడువు ప్రారంభమైన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.