![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana Election 2023: ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆయనకే ఛాన్స్
Telangana Election 2023: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు.
![Telangana Election 2023: ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆయనకే ఛాన్స్ Telangana Election 2023 CM KCR announced Nama Nageswara Rao as Khammam BRS MP candidate Telangana Election 2023: ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, ఆయనకే ఛాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/36b6397e00bfaedeb2350338d14b933d1698857110857861_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు ఇంకా 30 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు, నేతలు ప్రచారం చేస్తుండగా.. ముఖ్యనేతలందరూ వివిధ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తోన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలపైనే పార్టీలన్నీ దృష్టి పెట్టగా.. సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు సమయం ఉండగానే సీఎం కేసీఆర్ ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని బుధవారం ప్రకటించారు.
ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరును బహిరంగ సభలో ప్రజలందరి ముందు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రకటించారు. ప్రజల ఆశీస్సులతో మరోసారి నామా పార్లమెంట్‌లో అడుగుపెడతారనే నమ్మకం ఉందని తెలిపారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉండగా.. ఇప్పుడే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఈ ప్రకటన చేయడం విశేషంగా మారింది.
ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ. .. సత్తుపల్లి చైతన్యం ఉన్న ప్రాంతమని, ఎన్నికల్లో పార్టీలు కాదని, ప్రజలు గెలవాలని పిలుపునిచ్చారు. దళితబంధు అనే పదం పుట్టించింది కేసీఆర్ అని, ఎవరూ అడగకుండానే దళితబంధు పథకం తెచ్చానని అన్నారు. ఉత్తరభారతంలో దళితులపై నిత్యం దాడులు జరుగుతున్నాయని, చింతకాని మండలంలో వంద శాతం దళితబంధు ఇచ్చామని తెలిపారు. తరతరాల నుంచి దళితులు వివక్షకు గురయ్యారని, దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. డబ్బు రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారని, తమ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనని అంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పొంగులేటికి మరీ ఇంత అహంకారమా? అని ప్రశ్నించారు.
'చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్‌కు అవసరం లేదు. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్యను భారీ మెజార్టీతో గెలిపించండి.. సండ్ర సత్తుపల్లి పహిల్వాన్. ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీని తాకనివ్వను అని ఒక వ్యక్తి శపథం చేశాడు. అది అయ్యే పని కాదు. నియోజకవర్గంలో సండ్రకు మంచి పేరుంది. ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తే క్షణంలో వాలిపోతాడు. అంబులెన్స్ అయినా ఆలస్యం అవుతుందేమో కానీ వీరయ్య మాత్రం ఆలస్యంగా రాడని ప్రజలు చెబుతున్నారు. సభకు వచ్చిన జనాలను చూస్తుంటే సండ్ర వెంకట వీరయ్య 80 వేల మెజార్టీతో గెలుస్తారని అర్థమవుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎప్పుడూ వీరయ్య ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. వీరయ్య మీద ప్రజలకు ఎంతో అభిమానం ఉంది. మీ అందరి ఆశీస్సులు ఆయనపై ఉంటాయి' అని కేసీఆర్ పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)