Telangana Cotton Price: భారీగా పడిపోతున్న పత్తి ధర, రెండేళ్ల క్రితం రూ.12 వేలు, ఇప్పుడు రూ.7 వేలు
Telangana Cotton Price: తెలంగాణ రాష్ట్రంలో పత్తి ధర ప్రతి ఏటా పడిపోతోంది.
Telangana Cotton Price: తెలంగాణ రాష్ట్రంలో పత్తి ధర పడిపోతోంది. క్రమంగా పడిపోతున్న ధర పత్తి రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. గతేడాది సాగు చేసిన పత్తిని చాలా మంది రైతులు ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు. అప్పుడు ఆశించిన స్థాయి ధరలు లభించకపోవడం వల్ల వచ్చే ఏడాదైనా ధరలు పెరగకపోతాయా అనే ఆశాభావంతో చాలా మంది రైతులు పత్తిని నిల్వ చేసుకున్నారు. నిల్వ చేయడం వల్ల బరువు తగ్గి తూకం తక్కువగా వస్తుందని తెలిసినా చాలా మంది తక్కువ ధరకు అమ్ముకోలేక అలాగే తమ వద్ద ఉంచేసుకున్నారు. మరో నెలన్నరో కొత్త పత్తి మార్కెట్లకు రానుంది. ఈ ఏడాది కూడా ధరలు ఆశించినంతగా లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఉన్న ధరకు విక్రయిస్తే వచ్చే డబ్బులు అప్పుల వడ్డీలకే సరిపోతాయని రైతులు వాపోతున్నారు.
2022-23 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఎకకరాల్లో పత్తి సాగు అయింది. ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి చొప్పున 50 లక్షల ఎకరాల్లో 4 కోట్ల క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు అంచనా. ఈ పంటను ఇంకా 25 శాతానికి పైగా రైతులు ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఈ పరిస్థితులు ఉన్నాయి. త్వరలో విపణికి కొత్త పత్తి వస్తున్నందు వల్ల.. పాత పత్తికి ధర తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతోంది.
గత రెండు సంవత్సరాల నుంచి పత్తి ధర క్రమంగా పతనం అవుతూ వస్తోంది. 2021 సంవత్సరంలో క్వింటా పత్తికి రూ.10 వేల నుంచి రూ. 12 వేల వరకు ధర పలికింది. 2022 సంవత్సరం ప్రారంభంలో రూ. 9 వేల వరకు అమ్ముడు పోయింది. అయితే గతేడాది డిసెంబర్ నుంచి ధర మరింతగా పతనం అవుతూ వచ్చింది. ప్రస్తుతం క్వింటా పత్తికి రూ. 8 వేల నుంచి రూ.7,200 మాత్రమే వస్తోంది.
రాష్ట్రంలో తగ్గిన వరిసాగు
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ లో వరిసాగు తగ్గుముఖం పట్టింది. సాధారణ వరి సాగు విస్తీర్ణానికి గాను 119 శాతం పెరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపినప్పటీ.. గత సంవత్సరంతో పోలిస్తే తగ్గినట్లు చెప్పారు. వానాకాలం సీజన్ లో రాష్ట్రంలో పంటల సాగు 120.50 లక్షల ఎకరాలకు చేరిందని బుధవారం వ్యవసాయ శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 124.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో 97 శాతానికి పంటల సాగు చేరుకుంది. 49,86,634 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 59,66,886 ఎకరాల్లో అంటే 119 శాతం ఎక్కువగా వరినాట్లు పడ్డట్లు అధికారులు వెల్లడించారు.
గత సంవత్సరం 61,30,584 ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈ సంవత్సరం 1,63,698 ఎకరాలు తక్కువగా సాగు అయినట్లు అధికారులు తెలిపారు. పత్తి 50,59,225 ఎకరాల లక్ష్యానికి గాను 44,78,724 ఎకరాల్లో సాగు అవుతోంది. అంటే 88 శాతమే పత్తి సాగులోకి వచ్చింది. మెదక్, మహబూబాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, జనగామ, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలు సాగు లక్ష్యాన్ని అధిగమించాయని వ్యవసాయ శాఖ తెలిపింది.