TS Mega DSC: సుమారు 10 వేల పోస్టులతో మెగా డీఎస్సీ- సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం... ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టింది. త్వరలోనే మెగా డీఎస్సీ ద్వారా 9వేల 800 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని భావిస్తోంది.
Telagana Mega DSC: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి... ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. ప్రజలకు ఇచ్చిన హామీలపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ... గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిచేస్తున్నారు. ఇందులో భాగంగా మెగా డీఎస్సీపై కూడా చర్చిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందించబోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు...త్వరలోనే మెగా డీఎస్సీ ద్వారా దాదాపు 9వేల 800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తోంది.
అయితే... గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడున్నర నెలల క్రితం 5,089 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, పీఈటీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు... మొత్తం లక్షా 76వేల 530 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు అత్యధికంగా 60 వేల 190 దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు నవంబరు 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పరీక్షలను వాయిదా వేశారు. మరోవైపు... పెద్దసంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న (శుక్రవారం) అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ డీఎస్సీ ప్రస్తావన వచ్చింది. వచ్చే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు... ఇప్పటికే మెగా డీఎస్సీసై రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టింది. గత నోటిఫికేషన్‌తోపాటు దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థికశాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఉపాధ్యాయ ఖాళీలు సుమారు 9వేల 800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు అంచనాకు వచ్చాయి.
ఇక... తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని... గత జులైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ స్పష్టంగా చెప్పింది. దానికి సంబంధించి గణాంకాలు కూడా సమర్పించింది. అయితే... అందుకు భిన్నంగా 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం. దీని వల్ల 4,281 పోస్టులకు కోత పడింది. మరోవైపు... గతంలో విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370తోపాటు గత అక్టోబరులో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన 9,820 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీ పోస్టుల భర్తీకి సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం.
వచ్చే ఏడాది జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి పోస్టుల భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఆలోగా ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించినట్టు సమాచారం. అయితే... గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటీఫికేషన్ రద్దు చేస్తే సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇప్పటికే భర్తీ చేయాలని నిర్ణయించిన 5,089 పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు... ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు, డీఎస్సీకి ముడిపెడితే నియామకాలు పూర్తికావనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
ఇక... టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి సిలబ్‌స మారుస్తారా? లేక పాతదే కొనసాగిస్తారా? అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. రెండు నెలల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే సిలబ్‌సను ప్రకటించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా సిలబ్‌సను రూపొందించారు. అయితే.. గత సిలబస్ కొనసాగుతుందా? లేక మార్పులు చేస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది.