Revanth Reddy: హీరో ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి
Prabhas News | టాలీవుడ్ నటుడు ప్రభాస్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లులు కురిపించారు. ప్రభాస్ టాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్ కు పోటీ ఇస్తున్నాడని కితాబిచ్చారు.
Revanth Reddy praises Actor Prabhas at an event in Hyderabad | హైదరాబాద్: కష్టపడే గుణం కారణంగా క్షత్రియులు ఎక్కడైనా సక్సెస్ అవుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నమ్మకానికి, విజయానికి క్షత్రియులు మారుపేరని కొనియాడారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి వారు ఆదివారం నాడు (ఆగస్టు 18న) నిర్వహించిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కృష్ణంరాజుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రేవంత్ రెడ్డి
క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన టాలీవుడ్ నటుడు ప్రభాస్ (Actor Prabhas) తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. టాలీవుడ్, బాలీవుడ్ రేంజ్ దాటి హాలీవుడ్ కు పోటీ ఇస్తున్న నటుడు ప్రభాస్ అన్నారు. ప్రభాస్ లేకుండా బాహుబలి క్యారెక్టర్ ఊహించలేం అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. దివంగత నటుడు కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలో ఉందని, ఈ విజయాల్లో బోసురాజు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
Telangana CM @revanth_anumula garu about #Prabhas garu…🔥 pic.twitter.com/7q4105DmoC
— KUKATPALLY PRABHAS YUVASENA (@kukatpallyPY) August 18, 2024
రామ్ గోపాల్ వర్మ మంచి మిత్రుడన్న సీఎం రేవంత్
‘క్షత్రియులు (రాజులు) ఏ రంగంలో ఉన్నా రాణిస్తారు. మీడియాలో కూడా రాజులు రాణిస్తున్నారు. కృష్ణంరాజు పేరు లేకుండా సినీ ఇండస్ట్రీ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేం. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేశారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ సత్తా చాటిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాకు మంచి మిత్రుడు. రాజకీయాల్లోనూ రాజులు ఉండాలి. పార్టీలో చేరి సేవలు చేస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాలు కల్పిస్తాం. రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించాం. ఆయన ద్వారా నన్ను కలిసి మీ సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించండి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఫ్యూచర్ సిటీలో చేపట్టాం. హైదరాబాద్ లోని ఈ ఫ్యూచర్ సిటీలో మీరు (రాజులు) కూడా పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ ప్రభుత్వం మీకు సహకారం అందిస్తుందని’ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
‘చట్టసభల్లో క్షత్రియులకు అవకాశం కల్పిస్తాం. ముందు పార్టీలో అవకాశం ఇస్తాం. రాణించిన వారికి కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా టికెట్లు ఇచ్చేందుకు సిద్ధం. రాజకీయ చైతన్యం ఉన్నవారిని ప్రోత్సహించి వారిని ప్రజాప్రతినిధులుగా చేస్తామని’ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో క్షత్రియ భవన్ కు స్థలం కేటాయింపు, అనుమతుల విషయంలో సహకరిస్తాం అన్నారు. పేద క్షత్రియులకు కూడా సంక్షేమం అందజేస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Also Read: సీఎల్పీ భేటీలో అభిషేక్ మను సింఘ్వీ అభ్యర్థిత్వానికి ఆమోదం