CM Revanth Reddy: విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ - ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన
Telangana News: విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా చూస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్‌పైనా కీలక ప్రకటన చేశారు.
CM Revanth Reddy Comments On Re Imbursment Job Calendar: ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. జేఎన్టీయూలో (JNTU) ఏర్పాటు చేసిన 'నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంజినీరింగ్ కళాశాలలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశంలో తొలిసారిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని.. జేఎన్టీయూ పరిధిలో కళాశాలలు నిర్వహిస్తోన్న సిబ్బందికి ప్రభుత్వ విధానం తెలియాలని అన్నారు. సర్కారు విధానాలు అందరికీ తెలిసేలా ప్రస్తుత కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ గ్రూప్ - 1, పరీక్షల వాయిదాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కళాశాలలు నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా ఉండకూడదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. 'అభివృద్ధి చెందుతున్న దేశానికి సివిల్ ఇంజినీరింగ్ అత్యంత అవసరం. కొన్ని కళాశాలల్లో ఆ కోర్సు లేకుండా చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కచ్చితంగా నడపాలి. ఈ కోర్సులు లేకుంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. గత సీఎంలు తీసుకున్న విధానాల వల్ల ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్నాం. ఉపాధి, భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ కోర్సులు ఉండాలి.' అని సీఎం పేర్కొన్నారు.
'స్కిల్ డెవలప్‌మెంట్ వర్శిటీ ఏర్పాటు'
రాష్ట్రంలో త్వరలోనే స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం సహా అటానమస్ హోదా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోంది. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెట్టాలి. ఇందు కోసం ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుంది. మనం పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తయారుకావాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మా ప్రభుత్వ కృషి చేస్తోంది.' అని సీఎం తెలిపారు.
గ్రూప్ - 1పై కీలక ప్రకటన
ఈ సందర్భంగా గ్రూప్ - 1పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీజీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతోందని.. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. 'గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఇప్పుడు 1:100 పిలవాలని కొందరు కోరుతున్నారు. అయితే, ఇలా పిలవడానికి మాకు ఏ ఇబ్బందీ లేదు. కానీ కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే నోటిఫికేషన్‌లో చెప్పిన విధంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుంది.' అని స్పష్టం చేశారు.
పరీక్షల వాయిదాపై..
డీఎస్సీ, గ్రూప్ - 2, 3 పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్లపై సీఎం రేవంత్ స్పందించారు. పదేళ్లుగా ఉద్యోగాల భర్తీ సరిగ్గా జరగలేదని.. ఇప్పుడు పకడ్బందీగా నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు పోటీ పరీక్షలు వాయిదా కోసం పరితపిస్తున్నాయని ధ్వజమెత్తారు. 'ఏ పరీక్ష రాయలేనోడు పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష చేస్తున్నారు. నిన్న మొన్న దీక్ష చేసిన ముగ్గురు.. ఏ ఒక్క పరీక్ష రాసినా దాఖలాలు లేవు. ఇదొక విచిత్ర పరిస్థితి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు పూర్తైతే ఉద్యోగం రాని వారు వేరే జాబ్ చూసుకుంటారని అన్నారు.
జూబ్ క్యాలెండర్‌పై..
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. క్యాలెండర్ విడుదల తర్వాత ఉద్యోగాల భర్తీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇస్తామని చెప్పారు. మార్చి నెలాఖరు వరకూ అన్ని శాఖల్లోల ఖాళీల వివరాలు తెప్పిస్తామని.. ప్రతీ ఏడాది ఇదే వ్యవహారం కొనసాగుతుందని అన్నారు. జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధత ఉంటుందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు ఖాళీల ప్రకారం ఎలాగైతే నోటిఫికేషన్లు వస్తాయో.. తెలంగాణలోనూ అలాగే ఉద్యోగ ఖాళీల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read: BRS MLA Arikepudi Gandhi: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - ఇప్పటివరకూ ఎంతమంది చేరారంటే?