Ramzan Wishes: ఈద్ ముబారక్ - ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు
Telangana News: నెలవంక కనిపించడంతో గురువారం నాడు ముస్లింలు రంజాన్ పండుగ జరుపుకోనున్నారు. రంజాన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
![Ramzan Wishes: ఈద్ ముబారక్ - ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు Telangana CM Revanth Reddy and KCR extends warm wishes for Ramzan Eid ul Fitr Ramzan Wishes: ఈద్ ముబారక్ - ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/e9d6f2e434ae8ad1e9ba25d1429cc9ab1712767515112233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ramzan Eid ul Fitr 2024: హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నెలవంక కనిపించడంతో గురువారం (ఏప్రిల్ 11న) రంజాన్ పండుగ జరుపుకోనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy), ప్రతిపక్షనేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శం
ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే పాత బస్తీలో మెట్రో రైలు లైన్ కు శంకుస్థాపన చేయటంతో పాటు మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను పెంచిందని గుర్తు చేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల సొంత భవనాల నిర్మాణానికి స్థలాలను సమకూర్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా అశీర్వాదాలుండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రార్ధించారు.
కేసీఆర్ ‘ఈద్ ఉల్ ఫితర్’ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదినం సందర్భంగా ముస్లిం సహోదరులకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాస ధీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు, తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయన్నారు.
అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, నూతన రాష్ట్రాన్ని సర్వమతాల సమాహారంగా, గంగా జమునా తహజీబ్ కు ఆలవాలంగా నెలకొల్పామని, లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తమ పదేండ్ల పాలనలో నిలబెట్టామని కేసీఆర్ తెలిపారు. అదే సాంప్రదాయం కొనసాగాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని దైవాన్ని కేసీఆర్ ప్రార్థించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)