KCR Saddula Bathukamma: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Saddula Bathukamma Wishes: సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (Telangana CM KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
KCR Saddula Bathukamma Wishes:
హైదరాబాద్: తెలంగాణ పూల పండుగ, రాష్ట్ర పండుగలలో ఒకటైన బతుకమ్మ ముగింపు చివరి రోజు “సద్దుల బతుకమ్మ”గా నిర్వహిస్తారని తెలిసిందే. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (Telangana CM KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేవీదేవతలను అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతాభావనను తెలియజేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. సబ్బండ వర్గాలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని సీఎం తెలిపారు.
పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరుల సమృద్ధితో నేడు తెలంగాణ రాష్ట్రం నిండైన బతుకమ్మను తలపిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మను పండుగను జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలనీ జగన్మాత గౌరీదేవిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రార్థించారు.
పూలనే దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ
బతుకమ్మ పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా కొన్నిరోజుల కిందట సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని చెప్పారు.
ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై, ఉత్సవాల ముగింపు రోజైన 'సద్దుల బతుకమ్మ' దాకా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలంతా ఆటా పాటలతో కోలాట చప్పట్లతో కలిసికట్టుగా జరుపుకునే బతుకమ్మ సంబురాలతో, తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక పండుగ శోభ సంతరించుకుంటుందని సీఎం అన్నారు. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వ వ్యాప్తంగా చాటుతుందని సీఎం తెలిపారు.
మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు మహిళా సాధికారతను పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రకృతిమాతను ప్రార్థించారు.