(Source: ECI/ABP News/ABP Majha)
Nikhat Zareen - Sreeja: నిఖత్ జరీన్, శ్రీజలకు అర్జున అవార్డులు, సీఎం కేసీఆర్ అభినందనలు
Nikhat Zareen - Sreeja:: తమ తమ క్రీడల్లో విశేష ప్రతిభ చూపి అర్జున అవార్డు అందుకున్న నిఖత్ జరీన్, శ్రీజలను సీఎం కేసీఆర్ అభినందించారు.
Nikhat Zareen - Sreeja: ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు అర్జున అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తంచేశారు. ఆమెకు అభినందనలు తెలిపారు. క్రీడల్లో విశేష ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డు అందిస్తారు. మహిళా బాక్సింగ్ లో వరుస విజయాలు నమోదు చేస్తూ, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్ అర్జున అవార్డుకు నూటికి నూరు శాతం అర్హురాలని సీఎం అన్నారు. యావత్ భారత జాతి తెలంగాణ బిడ్డ ప్రతిభను చూసి గర్విస్తోందన్నారు.
శ్రీజ మరింత ఎదగాలి
టేబుల్ టెన్నిస్ క్రీడలో చూపిన ప్రతిభకు అర్జున అవార్డు అందుకున్న తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజను కూడా సీఎం కేసీఆర్ అభినందించారు. తన ప్రతిభతో ఆ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
అర్జున అవార్డు గ్రహీతలకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ
ఈ ఏడాది సైతం కేంద్రం అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు క్రీడా పురస్కారాలు ప్రకటించారు. అర్జున అవార్డు గ్రహీతలకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ, ప్రశంసా పత్రం అందిస్తారు. బ్యాడ్మింటన్ నుంచి లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, అథ్లెటిక్స్ నుంచి సీమా పూనియా, ఎల్డోస్ పాల్, అవినాష్ ముకుంద్ సాబెల్ అర్జున అవార్డు దక్కించుకున్నారు. చెస్ నుంచి భక్తి ప్రదీప్ కులకర్ణి, ఆర్. ప్రగ్నానంద, బాక్సింగ్ నుంచి అమిత్, నిఖత్ జరీన్‌లను ఎంపిక చేసింది కేంద్రం. హాకీ నుంచి దీప్ గ్రేస్ ఎక్కా, జూడో నుంచి సుశీలా దేవి, కబడ్డీ నుంచి సాక్షి కుమారి, మల్లఖంభ్ నుంచి సాగర్ కైలాస్ ఓవాల్కర్, లాన్ బౌల్ నుంచి నాయన్ మౌని సైకియాలను అర్జున అవార్డు వరించింది.
రెజ్లింగ్ నుంచి అన్షు, సరిత, వుషు నుంచి శ్రీ పర్వీన్, టేబుల్ టెన్నిస్ నుంచి శ్రీజ అకుల, షూటింగ్ విభాగం నుంచి ఎలావేనిల్ వలారివాన్, ఓం ప్రకాశ్ మిథర్వాల్ అర్జున అవార్డును రాష్ట్రపతి భవన్ వేదికగా అందుకోనున్నారు. పారా స్విమ్మింగ్ నుంచి స్వప్నిల్ సంజయ్ పాటిల్, పారా బ్యాడ్మింటన్ నుంచి మానసి గిరిశ్చంద్ర జోషి, తరుణ్ దిల్లాన్, డెఫ్ బ్యాడ్మింటన్ నుంచి జెర్లిన్ అనికాను అర్జున అవార్డు వరించింది.
ఈ (2022) ఏడాదికి కేంద్రం మొత్తం 25 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. బాక్సర్ నిఖత్ జరీన్ ను కూడా అర్జున అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ అచంటా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును సొంతం చేసుకున్నాడు. శరత్ కమల్ రూ. 25 లక్షల ప్రైజ్‌మనీ, ప్రశంసాపత్రాన్ని అందుకోనున్నాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నవంబర్ 30న జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
టేబుల్ టెన్నిస్ క్రీడలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజకు ప్రతిష్టాత్మక 'అర్జున అవార్డు' రావడం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీజకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో క్రీడారంగంలో శ్రీజ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు.#ArjunaAward
— Telangana CMO (@TelanganaCMO) November 16, 2022