KCR Runa Mafi : ఈ నెలలోనే రూ.50వేల రుణమాఫీ..! రైతులకు కేసీఆర్ వరం..!
రుణమాఫీ, ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల అమలుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ మంత్రి వర్గం
హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణలోని రైతులకు కూడా గుడ్ న్యూస్ చెప్పిస్తోంది. కేసీఆర్ సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటి వరకూ అమలు చేయని రుణమాఫీ పథకాన్ని ఈ నెలలోనే పట్టాలెక్కించాలని కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. యాభై వేల వరకు రుణం ఉన్నరైతులకు 15వ తేదీతో ప్రారంభించి 30వ తేదీలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల కనీసం ఆరు లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుంది.
2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లినప్పుడు రూ. లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత రుణమాఫీ పథకం అమలు చేయడానికి సమస్యలు ఎదురయ్యాయి. ఆర్థికంగా ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. ఏడాది తర్వాత రుణమాఫీ పథకం అమలు చేయడానికి విధివిధానాలు ఖరారు చేశారు. బ్యాంకులతో సంబంధం లేకుండా... రూ. లక్ష రైతులకు విడతల వారీగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ పథకం ముందడుగు పడలేదు. హుజూరాబాద్ లో దళితులకు ఇచ్చేందుకు రూ. వెయ్యి కోట్లయినా ఖర్చు చేస్తారు కానీ ఎన్నికల హామీ అయిన రుణమాఫీ మాత్రం అమలు చేయరా అన్న ప్రశ్నలు... విపక్షాలు... రైతుల నుంచి వస్తున్నాయి. దీంతో కేసీఆర్ కనీసం రూ. యాభై వేలు అయినా రుణమాఫీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. పంటరుణ మాఫీ వివరాలను అర్థికశాఖ అధికారులకు కేబినెట్‌కు అందజేశారు.
రుణమాఫీతో పాటు తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించారు. రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. కరోనా పరిస్థితులపైనా సుదీర్ఘంగా చర్చించారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కొత్త వైద్య కళాశాలలకు భవనాలు, హాస్టళ్లు, మౌలికవసతుల కల్పనపై తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పూర్తి వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది. రాష్ట్రంలో అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధానం రూపకల్పన కోసం మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. పటాన్ చెరులో కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంతో పాటు వరంగల్, చెస్ట్ ఆసుపత్రి , టిమ్స్ , గడ్డిఅన్నారం మార్కెట్, ఆల్వాల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.