Telangana Budget Sessions 2024: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- వారం రోజుల పాటు జరిగే ఛాన్స్- రెండు పథకాల అమలుపై క్లారిటీ
TG Budget Sessions: ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టిసారించిన కాంగ్రెస్ ప్రభుత్వం, బడ్జెట్ సమావేశాల్లోనే మరో రెండు పథకాలకు శ్రీకారం చుట్టబోతోంది.
Telangana Budget Sessions 2024: నేటి (ఫిబ్రవరి 8 గురువారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 నిమిషాలకు గవర్నర్ తమిళిసై ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత ఎమ్మెల్యే హోదాలో సమావేశాలకు హాజరుకానున్నారు. ఇప్పటికే నీటి పారుదల ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో ఫైట్ జరుగుతుంది. అది సభపై కూడా ప్రభావం చూపుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ప్రభుత్వం మరో రెండు హామీలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. దీనిపై ఈ సారి సభలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అర్హుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించే లోపే ఈ పథకాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. రేషన్‌కార్డు, ఆధార్, ఫోన్ నెంబర్ అనుసంధానమై ఉన్న కరెంట్ కనెక్షన్లకు తొలుత గృహజ్యోతి పథకం అమలు చేయనున్నారు. వీటి ఆధారంగా ఇప్పటికే సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. చాలామంది ప్రజాపాలన దరఖాస్తు సమయంలో ఫోన్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు నమోదు చేయలేదు. ఇప్పుడు సిబ్బంది ఇంటింటికి వెళ్లి మరోసారి వివరాలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే తొలుత పథకాన్ని అమలు చేయాలని...ఆ తర్వాత రేషన్ కార్డులు అందేజేసి అర్హులైన అందిరికీ ఈ పథకాన్ని అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
10న తెలంగాణ బడ్జెట్
కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు వారం రోజులు జరిగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదా తీర్మానంపై చర్చకు రెండురోజులు పోయినా...మిగిలిన మూడురోజులు బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో వ్యవసాయరంగంపై శ్వేతపత్రం విడుదల చేసి చర్చంచాలని ప్రభుత్వం భావిస్తోంది . తొలి సమావేశాలకు ఆరోగ్యం సహకరించక హాజరుకాని కేసీఆర్(KCR) ఈ సమావేశాలకు రానుండటంతో మరింత వాడీవేడిగా బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
ఈనెల 10న శాసనసభలో ఆర్థికమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరుసటి రోజు సభకు సెలవు ఇచ్చి తిరిగి 12 వ తేదీన ఓటన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చించనున్నారు. సభ ఈ నెల 17 వరకు నిర్వహించే అవకాశం ఉంది.. పరిస్ధితిని బట్టి సమావేశాలు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బడ్జెట్ కేటాయింపులపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలకే దాదాపు 60వేల కోట్లు అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గృహజ్యోతితోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్లు అందించే రెండు పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించనున్నారు.
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సైతం అస్త్రాలతో సిద్ధమైంది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్‌పై ఆ పార్టీ నేతలు పట్టుబట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1నే గ్రూప్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దీనిపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు బీమా, రుణాల మాఫీపైనా వారు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది.