(Source: ECI/ABP News/ABP Majha)
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ - రాష్ట్ర బడ్జెట్ ఆరోజే
Telangana News: జూలై 24 నుంచి జరగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి అంశాలపై వాడి వేడి చర్చ జరగనుందని అంటున్నారు.
Telangana Assembly Session: ఈనెల 24 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వారం రోజుల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈనెల 23 న కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. అందులో రాష్ట్రానికి కేటాయింపులను బట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ను కాంగ్రెస్ సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఈనెల 25 లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.
ఈసారి జరిగే సమావేశాల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి అంశాలపై వాడి వేడి చర్చ జరగనుంది. కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై కూడా చర్చ జరగనుంది. పలు కీలక బిల్లులు కూడా రేవంత్ సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఇంకా ఆరు గ్యారెంటీల అమలు, నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు పలువురు అధికారులతో మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్ భేటీ అయ్యారు.