Telangana Teachers Transfer: టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, అదనపు పాయింట్లపై సైతం క్లారిటీ
Teachers Transfers in Telangana : రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు నిరాకరించింది.
Teachers Transfers in Telangana :
హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. టీచర్ల బదిలీలపై ఇంతకు ముందు ఉన్న మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఎవరికి అదనపు పాయింట్లు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అయితే బదిలీ ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయ సంఘాల నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా చేయాలని సూచిస్తూ ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చింది.
టీచర్ యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకూడదని చెప్పిన హైకోర్టు.. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి మాత్రం అనుమతి ఇచ్చింది. భార్యాభర్తలు ఒకేచోట కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఉపాధ్యాయుల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని బుధవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. చిక్కుడు ప్రభాకర్, కృష్ణయ్య పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం హైకోర్టు టీచర్ల బదిలీలకు అనుమతి ఇచ్చింది. యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లు కేటాయించరాదని చెబుతూనే, టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అందుకే వారికి ప్రత్యేక పాయింట్లు..
టీచర్ ను పెళ్లి చేసుకుంటేనే ఉపాధ్యాయులను బదిలీ చేస్తారా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టీచర్ల బదిలీల్లో ఏ ప్రాతిపదికన టీచర్లను వేర్వేరుగా చూస్తున్నారని వివరణ కోరింది. భార్యాభర్తలు ఒకేచోట ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక పాయింట్లు కేటాయించినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. బదిలీలకు సంబంధించిన నిబంధనలను సవరించి ఆగస్టు 4వ తేదీన అసెంబ్లీ, 5వ తేదీన శాసన మండలిలో ఉంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు ప్రత్యేక పాయింట్లు కేటాయింపు వివాదానికి సంబంధించిన పిటిషన్లపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. బదిలీల నిబంధనల్లో ఇటీవల మార్పులు చేసి చట్ట సభల ముందు ఉంచినట్లు అదనపు అడ్వకేట్ జనరల్ జె. రామచంద్రారావు మెమో సమర్పించారు. మెమో, కౌంటర్ ఇవాళ ఇచ్చినందున వాదనలకు సమయం ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కొన్ని రోజుల కిందట కోరారు.
జీవో నెంబర్ 5, 9 లకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించింది. ఉపాధ్యాయుల బదిలీలకు ఈ ఏడాది ప్రారంభంలోనే రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాన్స్‌ఫర్ల మార్గదర్శకాలతో కూడిన జీవో నెంబర్ 5ను జనవరి 25వ తేదీన విడుదల చేసింది. కొన్ని సవరణల తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన 9 జీవోను జారీ చేసింది. ఆ తర్వాత షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మేరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను కూడా స్వీకరించింది. దీంతో 79 వేలకు పైగా దరఖాస్తులు కూడా ప్రభుత్వానికి అందాయి. అయితే బదిలీలు ప్రారంభం కావాల్సిన తరుణంలో కొందరు ప్రభుత్వం బదిలీలపై ఇచ్చిన జీవోల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కేసులు వేశారు. దీంతో నెలల తరబడి టీచర్ల ట్రాన్స్‌ఫర్ లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.