Telangana TDP : తెలంగాణలో టీడీపీ పోటీపై సస్పెన్స్ - పట్టించుకోని లోకేష్, బాలకృష్ణ !
తెలంగాణ టీడీపీ గురించి ఆ పార్టీ అగ్రనేతలు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా పోటీ చేయాలని టీ టీడీపీ నేతలు మాత్రం జాబితా రెడీ చేసుకున్నారు.
Telangana TDP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. కానీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జైల్లో ఉండటంతో సరైన విధంగా గైడ్ చేసే నాయకుడు లేకుండా పోయారు. నారా లోకేష్ తెలంగాణ రాజకీయాల గురించి అసలు పట్టించుకోవడం లేదు. బాలకృష్ణ.. ఒక్క సారి సమీక్షా సమావేశం పెట్టి.. తాను తెలంగాణ అంతా పర్యటిస్తానన్నారు.కానీ మళ్లీ ఆయన కూడా సైలెంట్ అయ్యారు. మరో వైపు జాబితా రెడీ చేసుకుని తెలంగాణ నేతలు ఆమోదం కోసం ఎదురూ చూస్తున్నారు.
జాబితా రెడీ చేసుకున్న కాసాని జ్ఞానేశ్వర్
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాసాని జ్ఞానేశ్వర్ రెడీ చేసుకున్నారు. 75 మంది జాబితా సిద్ధం అయిందని, రేపో మాపో ములాఖత్‌లో అధినేత చంద్రబాబును కలిసి అభ్యర్థులను ప్రకటించాలని అనుకుంటున్నారు. చంద్రబాబు విడుదలపై గత కొద్ది రోజులుగా ఆ పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏసిబి కోర్టు ఒక వైపు ఆయన విడదలపై ఆలస్యం చేస్తుండగా సుప్రీం కోర్టు కూడా వచ్చే నెల 9కి కేసును వాయిదా వేసింది. దీంతో రెండో సారి ములాఖత్‌కు వెళ్లి కలిసి అభ్యర్థుల ప్రకటన వచ్చేలా చూడాలని టి టిడిపి కార్యాచరణ రూపొందించుకుంటోంది. నామినేషన్లు దాఖలుకు ఇంకా సమయం ఉందని, ఈ లోగానే చంద్రబాబును కలిసి అభ్యర్థుల పేర్లు ప్రకటించుకుంటామని టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొంటున్నారు.
ఆకర్షణీయ హామీలతో మేనిఫెస్టో కూడా !
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పేర్లను అధినేత చంద్రబాబు ఓకే చేసిన రోజునే పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. బిఆర్‌ఎస్, బిజెపి , కాంగ్రెస్ సహా పలు పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఆ స్థాయిలోనే మేనిఫెస్టో ఉండేలా చూసుకుంటోంది. రైతులు, కూలీలు, యువత, గ్రామీణ ప్రాంత వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి ప్రకటించిన మేనిఫోస్టోను కూడా ఒక సారి పరిగణనలోకి తీసుకున్నాకే తుది జాబితాను సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కాగా ఏదో రకంగా అధినేత చంద్రబాబు జైలు నుండి బయటికి వస్తే ఆయన చేతుల మీదుగానే అభ్యర్థుల ప్రకటన వచ్చేలా చేస్తామని గత కొద్ది రోజులుగా చెబుతున్న టి టిడిపి ప్రస్తుతం ఇంకొన్ని రోజులు వేచి చూద్దామనే ధోరణిలో ఉంది. తొలి విడతగానే 70 లేదా 75 మందిపేర్లను చంద్రబాబు తొలి విడతలోనే ప్రకటిస్తారని మరి కొందరు చెబుతున్నారు. ఏతా వాతా మొత్తంగా 75 మంది పోటీ చేయడమైతే పక్కా అని ఇంకొందరు చెబుతున్నారు.
బీజేపీతో పొత్తులపై వ్యతిరేకత
బీజేపీతో పొత్తు గురించి తరచూ చర్చ జరుగుతోంది. జనసేన, బీజేపీ మధ్య చర్చలు జరిగాయి. టీడీపీతో కిషన్ రెడ్డి మాట్లాడారని చెబుతున్నారు. అమిత్ షాతో లోకేష్ భేటీలో కిషన్ రెడ్డికూడా పాల్గొన్నారు. అయితే తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం బీజేపీతో పొత్తు కన్నా ఒంటరిగా పోటీ చేయడమే మేలని భావిస్తున్నారు. మరో వైపు అసలు పార్టీ హైకమాండ్ పోటీ చేయాలా వద్దా అన్నదానిపైనా ఆలోచిస్తోదంన్న ప్రచారమం జరుగుతోంది.