Kodada News : గంజాయికి బానిసైన కొడుకు, కట్టేసి కళ్లలో కారం కొట్టిన తల్లి!
Kodada : మత్తు పదార్థాలకు బానిసలు అయి చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కోదాడలో 15 ఏళ్ల యువకుడు గంజాయికి బానిస అయ్యాడు. అతని తల్లి మత్తు భూతాన్ని వదలగొట్టేందుకు కళ్లలో కారం కొట్టింది.
Kodada News : హైదరాబాద్(Hyderabad) బంజారాహిల్స్ పబ్ డ్రగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. డ్రగ్స్, గంజాయి ఎక్కడ దొరికినా ఉపేక్షించేది లేదని, నిందితులు ఎంతటి వారైనా సహించేది లేదని ప్రభుత్వం అంటోంది. అధికారులకు కఠినమైన చర్యలు తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే తాజాగా కోదాడలో గంజాయి కలకలం రేగింది. కోదాడలో గంజాయికి బానిస అయిన కొడుక్కి ఎన్ని చెప్పినా వినడంలేదని, ఇంటికి రాకుండా రోజూ గంజాయి సేవిస్తున్నాడని స్థంభానికి కట్టేసి కళ్లలో కారం కొట్టిందో తల్లి. ఎన్ని సార్లు తన కుమారుడికి చెప్పినా వినకుండా రోజు ఇలా గంజాయి సేవిస్తుండడంతో, ఇలా కారం కొట్టానని ఆవేదన వ్యక్తం చేసింది ఆ తల్లి. ఇకనైనా కోదాడలో గంజాయి దొరకకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తన కుమారుడినీ ఈ గంజాయి బారి నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంది.
అసలేం జరిగిందంటే?
సూర్యాపేట కోదాడలో గంజాయికి బానిస అయిన కుమారుడిని ఆ భూతం నుంచి రక్షించుకునేందుకు నానా కష్టాలు పడింది. ఎన్నోసార్లు కుమారుడిని ప్రాధేయపడింది. పట్టుమని 15 ఏళ్లు లేని యువకుడు గంజాయికి బానిస ఇంటికి కూడా రావడంలేదు. కొడుకుని మార్చుకునేందుకు ఏం చేయాలో పాలుపోని ఆ తల్లి చివరికి కఠిన నిర్ణయం తీసుకుంది. కుమారుడిని దండించి గంజాయి నుంచి తప్పించాలని అనుకుంది. ఇంటికి రాకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ గంజాయి తాగుతున్నాడు యువకుడు. తల్లి ఎంత చెప్పినా వినిపించుకోకుండా తిరుగుతున్నాడు.
మత్తు పదార్థాల బారి నుంచి రక్షించుకునేందుకు
చివరికి ఏం చేయాలో దిక్కుతోచక కొడుకు బలవంతంగా పట్టుకుని స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పెట్టింది తల్లి. ఎంతగా వేడుకుని చెప్పినా వినడం లేదని అందుకే ఇలా చేయాల్సి వస్తోందని ఆమె ఆవేదనతో చెప్పింది. గంజాయి దొరక్కుండా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాని కోరింది. తన కొడుకును ఈ మత్తు పదార్థాల బారి నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. డ్రగ్స్, గంజాయి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ తో సహా ఇతర ప్రాంతాల్లో నిత్యం దాడులు నిర్వహిస్తూ గంజాయి రవాణాను అడ్డుకుంటుంది. అయితే కొందరు అక్రమార్కులు పక్క రాష్ట్రాల నుంచి గంజాయిని సీక్రెట్ గా తీసుకొట్టి అన్యంపుణ్యం తెలియని పిల్లలకు అలవాటు చేస్తున్నారు. మొగ్గలోనే వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ మత్తు పదార్థాలకు అలవాటు పడి ఓ విద్యార్థి మరణించాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మత్తుపదార్థాల సరఫరాలపై ఉక్కుపాదం మోపితేనే ఈ సమస్యలు పరిష్కారం ఉంటుందని ప్రజలు భావిస్తు్న్నారు. ప్రజల్లో కూడా అవగాహన రావాలని మత్తు పదార్థాలు జోలికి పోకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.