Kavitha News: నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ, ముగియనున్న ఈడీ గడువు - తీర్పుపై ఉత్కంఠ!
ఢిల్లీ లిక్కర్ కేసులో గత మార్చి నెలలో కవిత ఈడీ విచారణకు పలుసార్లు హాజరైన సంగతి తెలిసిందే.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొద్ది రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమన్ల రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు కవిత వెళ్లారు. ఈ విచారణ సుప్రీంకోర్టులో నేడు (సెప్టెంబరు 26) జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారణ చేయనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితకు నోటీసులు పంపింది. ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో గత మార్చి నెలలో కవిత ఈడీ విచారణకు పలుసార్లు హాజరైన సంగతి తెలిసిందే. ఈడీ ఆఫీసులో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ అప్పటి నుంచి కవిత చెబుతూ వస్తున్నారు. దీనిపై అప్పుడే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే ఈడీ తనను విచారణ చేయాలని కవిత కోరుతున్నారు. ఈ క్రమంలో ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మళ్లీ ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులు జారీ అవడంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు.
అయితే, తాన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ దశలో ఉండగానే.. నోటీసులు ఎలా జారీ చేస్తారని కవిత ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఈడీ నోటీసులు వెలువడిన వెంటనే తాను విచారణకు రాలేనని కూడా ప్రెస్ మీట్ నిర్వహించి చెప్పేశారు. అయితే, కవిత బిజీగా ఉంటే నోటీసుల విషయంలో పది రోజుల వెసులుబాటు సమయం పొడిగిస్తామని ఈడీ తెలిపింది. ఈ క్రమంలో నేటితో ఆ పది రోజుల గడువు ముగియనుంది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ ఏర్పడింది.