MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఆర్ఎస్‌కు ఊరట, విచారణ జూలై 31కి వాయిదా
ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దనే నిబంధన ఉందని న్యాయమూర్తి చెప్పారు. అప్పటిదాకా సీబీఐ దర్యాప్తు అధికారులకు రికార్డులు అందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. జూలై 31కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దనే నిబంధన ఉందని న్యాయమూర్తి చెప్పారు. అప్పటిదాకా సీబీఐ దర్యాప్తు అధికారులకు సంబంధిత రికార్డులు, పత్రాలు అందించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఈ మేరకు సంజీవ్ ఖన్నా ధర్మాసనం సోమవారం ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పటికే సీబీఐ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు కోర్టును స్టే అడిగింది. సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని తిరస్కరించింది. తాజాగా కోర్టు ఇచ్చిన స్టేటస్ కోతో సీబీఐ విచారణ ప్రస్తుతానికి వాయిదా పడినట్టే తెలుస్తోంది. అంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది డిసెంబర్ 26న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఫిబ్రవరి5న హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 7వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోరు నడుస్తోంది. తమ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుండగా, దీనిపై తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అంతా నాటకమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన సమయంలో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ వాతావరణం నెలకొని ఉంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడం తాజాగా విచారణను జులై 31కి వాయిదా వేయడంతో ప్రభుత్వానికి ఊరట లభించినట్లు అయింది.