(Source: ECI/ABP News/ABP Majha)
Government Schemes For Women: మహిళల కోసం తెలంగాణలో ప్రత్యేక పథకాలు - అమల్లో ఉన్న స్కీమ్‌లు ఇవే!
Schemes For Women: మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రస్తుతానికి కొన్ని పథకాలను అమలు చేస్తుండగా.. రానున్న రోజుల్లో మరికొన్ని స్కీమ్‌లను ప్రవేశపెట్టనుంది.
Telangana Government Schemes For Women: ప్రస్తుత సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు ఆర్ధిక విషయాల్లో పోటీ పడుతున్నారు. మహిళా సాధికారత పెరిగినప్పుడు దేశం కూడా అభివృద్ది చెందుతుంది. దీంతో మహిళా సాధికారత పెంచడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం అనేక ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. మహిళల ఆర్థికాభివృద్ది, స్వీయాభివృద్ది కోసం ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా తోడ్పాలు అందిస్తున్నాయి. అదే బాటలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళల అభివృద్ది కోసం అనేక ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేంటి? రానున్న రోజుల్లో మహిళ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది? అనేవి చూద్దాం.
ఉచిత బస్సు ప్రయాణం
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు తెలంగాణ సర్కార్ టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా జర్నీ చేయవచ్చు. డిసెంబర్ 9న ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్
ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉండి రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు.
మహిళలకు నెలకు రూ.2,500
మహిళలకు ఆర్ధిక తోడ్పాలు అందించేందుకు ప్రతీ నెలా రూ.2,500 సహాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ పథకంను రానున్న రోజుల్లో అమలు చేయనున్నారు. అలాగే ఒంటరి మహిళలకు రూ.4 వేల పెన్షన్ అందించే కార్యక్రమాన్ని కూడా అమల్లోకి తీసుకురానున్నారు.
విద్యార్థినులకు స్కూటర్లు
18 సంవత్సరాలు నిండి కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు పెంపు
అంగన్వాడీ టీచర్ల జీతం రూ.18 వేలకు పెంచడంతో జాబ్ సెక్యూరిటీ కల్పించడం కోసం వారిని EPF కవరేజీ పరిధిలోకి తీసుకువస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చింది. అలాగే ప్రభుత్వ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజన కార్మికుల జీతం రూ.10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించింది. వీటిని కూడా అమలు చేస్తే మహిళలకు లబ్ధి చేకూరనుంది.
ఆడపిల్లలకు ఇందిరమ్మ కానుక
ఇందిరమ్మ కానుక పథకం ద్వారా పెళ్లి చేసుకునే హిందూ అమ్మాయిలకు రూ.లక్ష, మైనార్టీ అమ్మాయిలకు రూ.లక్షా 60 వేల సాయం అందించనున్నారు. దీంతో పాటు 10 గ్రాముల బంగారం కానుకగా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ పథకం అమలు చేస్తే యువతులకు సహాయం అందనుంది.
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు
ఇక మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక నిధితో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులను గ్రామాలు, పట్టణాలకు విస్తరించడం, డ్వాక్రా గ్రూపులకు శాశ్వత బిల్డింగ్‌తో పాటు వారికి వడ్డీ లేని రుణాలు అందించడం, మహిళా కమిషన్‌ను బలోపేతం చేసి మహిళలకు రక్షణ కల్పించడం వంటి కార్యక్రమాలను చేపడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.