Telangana:పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక నిధులు- అమ్మ ఆదర్శ కమిటీలకు పనులు అప్పగింత
Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఆవరణ శుభ్రం చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. అమ్మ ఆదర్శ కమిటీలకు పనులు అప్పగించింది
Telangana Schools: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడం సహా...పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏపీలో వైసీపీ(YCP) హయాంలో అమ్మఒడి నిధుల నుంచే కోత విధించి చెల్లింపులు చేయగా...తెలంగాణ(Telangana)లో మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నెలకు రూ.3వేల నుంచి రూ.20 వేల రూపాయలు చెల్లించనుంది.
బడిలో పారిశుద్ధ్య నిధులు
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల(Govt Schools) రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు సర్కార్ బడి అంటే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న గదులు, ప్రహరీ లేని ఆటస్థలాలే దర్శనమిచ్చాయి.ఈడొచ్చిన ఆడపిల్లలు సైతం టాయిలెట్ కోసం బయట కంపచెట్ల మధ్యకు వెళ్లాల్సిందే. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా మూత్రశాలలు కట్టించారు. పాఠశాల చుట్టూ ప్రహరీగోడలు కట్టారు. దీంతో వాటి నిర్వహణ ఉపాధ్యాయులకు భారంగా మారింది. నిత్యం వందలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు వినియోగించే మూత్రశాలలను రోజూ శుభ్రం చేయకుంటే దుర్వాసన వెదజల్లడంతోపాటు విద్యార్థులు రోగాల బారీన పడే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. మొత్తం 10 నెలలకు సరిపడా నిధులను విడుదల చేయనుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పారిశుద్ధ్య పనులను ఇప్పటికే నియమించిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు చేపట్టనున్నాయి. బడిలో విద్యార్థుల సంఖ్యను బట్టి నెలకు కనిష్ఠంగా రూ.3వేలు ఇవ్వనున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటే రూ.20 వేల వరకు చెల్లించే అవకాశం ఉంది.
విధివిధానాలు
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడంతోపాటు పాఠశాల ఆవరణను ప్రతిరోజూ ఊడ్చి శుభ్రపరచాలి. ఇప్పటికే మొక్కల పెంపకానికి జిల్లా మినరల్ ఫండ్ ట్రస్టు నిధులు విడుదల చేస్తుండగా...వాటికి అదనంగా ఇప్పుడు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ నిధులు చెల్లించనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈ పనులను పంచాయతీలకు, మున్సిపల్ సిబ్బందికి అప్పగించినా ... పెద్దగా ఉపయోగం లేకపోవడంతో రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడంపై ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. దుర్వాసన వచ్చే మరుగుదొడ్లతో అటు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులే తమ సొంత సొమ్ములు వెచ్చించి మరుగుదొడ్లను కూలీలతో శుభ్రపరుస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక నిధులు అందుబాటులోకి రావడంతో ఇబ్బందులు తప్పనున్నాయి.
జగన్ మామ కోత
గత వైసీపీ ప్రభుత్వంలో తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి నిధుల్లో నుంచే వెయ్యిరూపాయలు కోత విధించి పారిశుద్ధ్య నిర్వహణకు కేటాయించారు. అయితే ఆ నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో మరుగుదొడ్లు శుభ్రపరిచేవారు లేక కంపుకొట్టేవి. కొన్నిసార్లు విద్యార్థులే వాటిని శుభ్రం చేసుకునేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వమే ఇప్పుడు నేరుగా నిధులు విడుదల చేస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఈ పనుల పర్యవేక్షణ బాధ్యత ఉపాధ్యాయులకే అప్పగించింది. పనులు సక్రమంగా చేయకుంటే అధికారులకు ఫిర్యాదు చేసి వారిని తొలగించే అవకాశం ఉంది.
Also Read: వీహబ్‌లో రూ.42 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన అమెరికా సంస్థ