VRA Sweeper : మొన్న బాల్ బాయ్స్, నేడు స్వీపర్ వీఆర్ఏలకు కొత్త డ్యూటీలు- ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు
VRA Become Sweeper : తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా వేములవాడ దారుణ ఘటన జరిగింది. ఆర్డీవో కార్యాలయంలో అధికారులు ప్రతి రోజు వీఆర్ఏతో స్వీపర్ పనులు చేయిస్తున్న ఘటన వెలుగుచూసింది.
VRA Become Sweeper : రాజన్న సిరిసిల్ల జిల్లా రెవెన్యూ విభాగంలో వీఆర్ఏగా పనిచేస్తున్న ప్రశాంత్ తో అధికారులు స్వీపర్ పనులు చేయిస్తున్నారు. అధికారుల ఆదేశాలతో ప్రశాంత్ ప్రతిరోజు ఉదయం వేములవాడలోని ఆర్డీవో కార్యాలయాన్ని శుభ్రం చేసి తిరిగి తన విధులకు వెళ్తున్నారు. వేములవాడలోని ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసి దాదాపు 10 నెలలు గడుస్తున్నా తగిన సిబ్బంది లేక అరకొర వసతులతో నడుస్తుంది. కనీసం కార్యాలయంలో అటెండర్ కూడా లేకపోవడంతో శుభ్రం చేసేవారు లేరు. దీంతో గత నెల రోజులుగా బోయిన్ పల్లి మండల కేంద్రంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ ను ప్రతిరోజు కార్యాలయాన్ని శుభ్రం చేయాలని అధికారులు ఆదేశించడంతో చేసేదేమి లేక ఉదయాన్నే వేములవాడ చేరుకుని కార్యాలయాన్ని శుభ్రం చేస్తున్నారు. అనంతరం ప్రశాంత్ విధులకు వెళ్తున్నారు. వెంటనే వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో సిబ్బందిని నియమించి స్వీపర్ అవస్థల నుంచి మోక్షం కలిగించాలని వీఆర్ఏ కోరుతున్నారు.
వీఆర్ఏలు బాల్ బాయ్స్
కలెక్టర్ హోదా ఉన్న వ్యక్తి ఎంతో హుందాగా, తన కింది స్థాయి ఉద్యోగులను గౌరవించాల్సి ఉంటుంది. కానీ కింది స్థాయి ఉద్యోగులతో చాకిరీ చేయించుకుంటున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. హోదా అడ్డుపెట్టుకుని తమ కింద పనిచేసేవారితో సొంత పనులు చేయించుకుంటున్నారు. నిర్మల్ కలెక్టర్ కూడా ఇలానే చేసి బుక్కయ్యారు. ప్రసుత్తం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే బంతులను అందించేందుకు వీఆర్ఏలకు డ్యూటీలు వేయడం వివాదం అయింది. నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ టెన్నీస్ అడుతుంటే వీఆర్ఏలు బాల్ బాయ్స్ అయిపోయారు. వీఆర్ఏలకు ఈ డ్యూటీలు వేసింది స్వయానా తహశీల్దార్ వారికి డ్యూటీ వేశారని సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో కలెక్టర్ స్పందించాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పి తప్పించుకున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానన్న కలెక్టర్
తహసీల్దార్ వీఆర్ఏలకు టెన్నిస్ బంతులు అందించే డ్యూటీల జాబితాను చూశాక మాట్లాడతానని కలెక్టర్ అన్నారు. నిర్మల్‌లో తొలి టెన్నిస్ స్టేడియం కాబట్టి ఇందులో ఎవరైనా ఆడుకునేందుకు రావొచ్చని కలెక్టర్ అన్నారు. టెన్నిస్ ఆడుకునేందుకు వీఆర్ఏలు వచ్చి ఉంటారేమోనన్నారు. ఇతర శాఖల అధికారులు, సామాన్య ప్రజలు కూడా ఇక్కడ ఆడుకునే వీలుందన్నారు. వీఆర్ఏలకు డ్యూటీల వేశారో లేదో పరిశీలిస్తానని ఆయన అన్నారు. అలా జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనల్లో ఉన్నతాధికారుల వేధింపులు ఉంటే తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.