Telangana Politics : సింగరేణికి బొగ్గు గనుల బాధ్యత ఎవరిది ? బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త పంచాయతీ !
Singereni coal mines issue : సింగేరేణి బొగ్గు గనుల అంశం బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారానికి కారణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి
Telangana Singereni coal mines Politcs : సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం వేలం వేసిన అంశంపై రాజకీయం ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సింగేరేణికి ఉన్న గనులు త్వరలో అియపోతాయని ఆ తర్వాత గనులు లేకపోతే సంస్థ మనుగడ ఉండదని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనుల్ని కూడా వేలం వేస్తోంది.ఈ వేలం ప్రక్రియను హైదరాబాద్ లో నిర్వహించారు. బొగ్గు రంగంలో పారదర్శకత, పోటీతత్వం, స్థిరత్వాన్ని పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరైన భట్టి విక్రమార్క సింగరేణి బొగ్గు గనుల అంశాన్ని ప్రస్తావించారు.
సింగేరణికి బొగ్గు గనులు కేటాయించాలన్న భట్టి విక్రమార్క
బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. గత ప్రభుత్వ పాలనలో కొయ్యగూడెం, సత్తుపల్లిలోని 6 కోల్ బ్లాకులను ను సింగరేణికి కేటాయిస్తే అనువుగా ఉంటుందని అన్నారు. ఈ విషయమై కిషన్ రెడ్డి ప్రధాని మోదీని ఒప్పించాలని భట్టి కోరారు. అవసరమైతే ప్రధానితో మాట్లాడేందుకు తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక బొగ్గు గనుల వేలంలో సింగరేణికి రిజర్వేషన్ కల్పించాలని భట్టి కోరారు. ఈ అంశంపై కిషన్ రెడ్డికి భట్టి వినతి పత్రం కూడా సమర్పించారు.
సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామన్న కిషన్ రెడ్డి
బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణి లాభం పొందేలా ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కోరిన అంశాలపై చర్చిస్తామన్నారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వేలం చేపట్టినట్లు తెలిపారు. ఆదాయం కోసమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని వివరణ ఇచ్చారు.
సింగరేణి పరిధిలోని శ్రావణ పల్లి బొగ్గు బ్లాక్ వేలం
సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు ను వేలం వేస్తున్నారు. శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. వేలంలో పాల్గొనలేదు. పాల్గొనకుండా అడ్డుకోవడం ద్వారా సింగరేణి సంస్థకు అపార నష్టం కలిగించిందని అప్పటి ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది.
మొత్తంగా సింగరేణి బొగ్గు గనుల రాజకీయం.. తెలంగాణలో ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.